- ఇయర్ ఎండింగ్ లో రక్తి.. న్యూఇయర్ రోజు భక్తి..
- కిటకిటలాడిన ప్రధాన ఆలయాలు
- ముందు రోజు మందేసి, చిందేసి, పార్టీల పేరుతో వేలల్లో ఖర్చు
- న్యూ ఇయర్ రోజు దైవ దర్శనాలకు ప్రాధాన్యత
- ఏ దేవాలయం ముందు చూసినా చాంతాడంత క్యూలే..
తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి న్యూ ఇయర్ రోజు కొత్త ఆశలతో కొత్త ఏడాదిని స్వాగతించిన జనం ఆలయాలకు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పేరొందిన ఆలయాలన్నీ కిటకిటలాడి పోయాయి. ఎక్కడ చూసినా పొడవాటి క్యూలు..దైవానుగ్రహం కోసం గంటల తరబడి సుదీర్ఘ నిరీక్షణ. ఎక్కడ చూసినా చాంతాడంత క్యూలే.. ఓపికగా క్యూలో వేచి చూసి ఆయా దేవుళ్లను భక్తితో దర్శించుకున్నారు. ప్రధాన శైవక్షేత్రాలు, వైష్ణవాలయాలు, ఇంకా మామూలు ఆలయాలు భక్త జనంతో కిటకిటలాడిపోయాయి… పూజాస్టోర్స్, పూల వ్యాపారులకు పండగే పండగ. లక్షల్లో వ్యాపారం జరిగింది. ఇక ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు, అర్చనలు, అభిషేకాలు స్పెషల్ పూజల పేరిట బోలెడు టిక్కెట్లు తెగి ఉంటాయి. జనం న్యూ ఇయర్ సెంటిమెంట్ కోట్లల్లో వ్యాపారం జరగడానికి కూడా దోహదపడింది.
అదే జోరు…
మినీ ఇండియాగా భావించే భాగ్యనగరంలో అయితే చెప్పనే అక్కర్లేదు. జూబ్లీ హిల్స్ లో వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ అదే తీరు.. ఎక్కడెక్కడి జనం క్యూలలో ఓపికగా నిలబడి దర్శనాలు చేసుకున్నారు. కొన్నిచోట్ల క్యూలు ఆలయం దగ్గర మొదలై కనీసం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ కనిపించాయి. పెద్దమ్మ గుడి, కట్టమైసమ్మ, బల్కంపేట ఎల్లమ్మ ఇలా గ్రామ దేవతల ఆలయాల్లోనూ ఇదే తాకిడి కనిపించింది. వనస్థలి పురం వెంకటేశ్వర స్వామి ఆలయం, కుకట్ పల్లి లోని సాయిబాబా ఆలయం, దిల్ షుక్ నగర్ అష్టలక్ష్మి ఆలయం, కీసరగుట్ట శివాలయం, లిబర్టీ దగ్గరున్న టీటీడీ కల్యాణ మండపంలోని బాలాజీ ఆలయానికీ, వీసాల బాలాజీగా పేరుపడ్డ చిలుకూరు బాలాజీ ఆలయానికి జనం తాకిడి విపరీతంగా కనిపించింది. భక్తుల తాకిడి నేపధ్యంలో కొన్ని చోట్ల ప్రదక్షిణలు కూడా ఆపేయాల్సి వచ్చింది. ఇక జిల్లాల్లో వరంగల్ భద్రకాళి అమ్మవారిని మొదలుకొని వేముల వాడ, ధర్మపురి, కొండగట్టు, యాదగిరిగుట్ట లాంటి ప్రధాన ఆలయాలన్నీ ఉదయాన్నే భక్తులతో పోటెత్తాయి.
ఏపీలోనూ ఇదే తీరు…
ఇక ఏపీలో విశాఖలో సంపత్ వినాయగర్ టెంపుల్, సింహాచల పుణ్యక్షేత్రం, అటు బెజవాడలో కనక దుర్గమ్మ, కర్నూలులో శ్రీశైలం , మంత్రాలయం లోనూ ఇదే తాకిడి. అటు ద్రాక్షారామం, అంతర్వేది, అన్ని పుణ్యక్షేత్రాలకు లక్షల్లో జనం పోటెత్తారు. తమ కోరికలు తీరాలని, ఏడాదంతా శుభ ప్రదంగా నడవాలని కోరుకున్నారు.
వెంకన్నకు భక్తుల తాకిడి…
ఇవన్నీ ఒక ఎత్తయితే తిరుమల వెంకన్న ఒక్కడూ ఒక ఎత్తు. కొత్త ఏడాదిలో వడ్డి కాసులవాడి ఆశీస్సుల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తిరుగిరులు వెంకన్న నామ స్మరణతో మార్మోగాయి. దాదాపు మూడు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం ఓపికగా నిరీక్షించారు. సర్వ దర్శనానికి సుదీర్ఘ సమయం పట్టింది. అయినా భక్తులు వెనక్కు తగ్గలేదు. నిన్న ఒక్క రోజే ఏకంగా 69 వేల మంది దర్శనాలు చేసుకున్నారని సమాచారం. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం న్యూ ఇయర్ ఒక్క రోజునే రూ.3.13 కోట్లకు చేరుకుందంటే అక్కడి రద్దీ ఊహించొచ్చు.
ఉప్పొంగుతున్న భక్తి భావం…
గతంతో పోలిస్తే జనంలో ఈ ట్రెండ్ చాలా ఎక్కువైంది. కొత్త ఏడాది దైవ దర్శనాలు, పూజలు ప్రజల్లో భక్తి భావనలు, సెంటిమెంట్లు, గతంకంటే బాగా పెరిగాయి. హిందూ భావజాలం కాస్త పెరిగినట్లు కనిపిస్తోంది. పండగలు జరుపుకోడం లోనూ అంతే. ఒకప్పుడు లేనిపోని చాదస్తాలని వదిలేసిన చిరకాల సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ.. ఆచారాలు, సెంటిమెంట్లు, సంప్రదాయాలను మళ్లీ కొనసాగిస్తున్నారు. హిందూ సమాజంలో వచ్చిన ఈ మార్పుకారణంగా పూజా సామాగ్రి, దైవ సంబంధ కార్యాలకు వినియోగించే వస్తువుల దుకాణాల సంఖ్యా గణనీయంగా పెరిగింది. జనం తమ ఆదాయంలో కీలక వంతు దైవ సంబంధ కార్యాలకు వినియోగిస్తున్నారు. ఉపవాసాలు, పరిహారాల గురించి తెలియచెప్పే పూజారులు, ప్రవచన కర్తలు, జ్యోతిష్కులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నారు. ఇక వాస్తు సంబంధ సెంటిమెంట్లయితే లెక్కే లేదు. పరిహారాలు, ప్రత్యేక పూజలు, మొక్కులకు జనం చేసే ఖర్చు విపరీతంగా కనిపిస్తోంది.
పూజలు, పరిహారాలు, ఉపవాసాలు…
బేసిగ్గా మూడు అంశాలపై ఆధారపడి హిందూ మతంలో వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. పూజలు, పరిహారాలు, ఉపవాసాలు.. ఈ మూడు అంశాలను బేస్ చేసుకునే వ్యాపారం సాగుతోంది. అమావాస్యలు, పౌర్ణమిలతో మొదలు కొని అన్ని ప్రధాన పండుగలకూ విశిష్టతే.
ఊపందుకున్న సామూహిక తత్వం…
సామూహిక పారాయణలు, నోములు, పూజలు, వ్రతాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయాలకూ ఇది ఆదాయమార్గంగా మారుతోంది. భజన మండళ్లు, సంస్కృతిక సేవా సంఘాల పేరుతో నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ ఆలయాల్లో నడుస్తోంది. ప్రధాన ఆలయాలు, సేవా మండళ్లు, ప్రధాన కూడళ్లు అన్నింటిపైనా కాషాయ జెండాల రెపరెపలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ ఆదాయంలో సింహ భాగం భక్తి కార్యక్రమాలకు జనం ఖర్చు చేస్తున్నారు. ఇందులో ప్రవచన కర్తల పాత్రా ఎక్కువే. పౌరాణిక కథలకు,ప్రత్యేక దైవాల ఆవిర్భావ వ్రుత్తాంతాలను నవనవోన్మేషంగా భక్తి రసం జోడించి, సెంటిమెంట్లను రంగరించి ప్రభోదిస్తున్నారు. జనంలో భక్తి భావం పెరగడానికి డిజిటల్ మీడియా కూడా కారణమవుతోంది. యూ ట్యూబ్ ఛానెళ్ల తాకిడి వచ్చాక రకరకాల థంబ్ నెయిల్స్ తో కొత్త కొత్త వీడియోలు చేసి వదులుతున్నారు.