33.4 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

పక్కా ప్రణాళిక.. నిర్విరామ పర్యవేక్షణతో సక్సెస్‌ఫుల్ న్యూ ఇయర్‌

హమ్మయ్య.. ఓ పనైపోయింది. దాదాపు పది పదిహేను రోజుల నుంచి చేసిన ప్లానింగ్‌ సక్సెస్ అయ్యింది. కొత్త సంవత్సరం ప్రారంభ వేడుకలు పూర్తి ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా, ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా హ్యాపీగా అందరూ ఎంజాయ్‌ చేశారు. ఈ పరిణామాలు ప్రజల్లో సంతోషం నింపితే.. పోలీసుల్లో సంతృప్తిని కలిగించాయి. పక్కా పకడ్బందీగా చేసిన ప్లాన్‌లు, ఏ ఒక్క ప్రమాదం కూడా జరగకుండా.. సంబరాలు సంతోషంగా జరుపుకునేలా తయారుచేసిన వ్యూహాలు సక్సెస్‌ అయ్యాయి. దీంతో, అందరూ భేష్‌.. తెలంగాణ పోలీస్‌ అని మెచ్చుకుంటున్నారు.

డిసెంబర్‌ 31 వచ్చిందంటే ప్రతియేటా పోలీసులకు ఓ సవాల్‌. ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ ప్రాంతంలో ఎవరు మద్యం మత్తులో ఘర్షణలకు దిగుతారో, ఏ రోడ్డుమీద ఎవరు బాగా తాగి డ్రంకెన్‌ డ్రైవింగ్‌తో యాక్సిడెంట్‌లకు కారకులవుతారో.. అని పోలీసులు ఊపిరి బిగబట్టుకొని ఆ రోజంతా విధులు నిర్వహిస్తారు. ఈసారి కూడా అదే స్థాయిలో.. అంతకుమించి డ్యూటీలు నిర్వహించారు. 31వ తేదీ మంగళవారం సాయంత్రం నుంచే పోలీస్‌ ఫోర్స్‌ అంతా అలర్ట్‌ అయ్యింది. తెల్లవార్లూ ప్రశంసించదగిన రీతిలో విధినిర్వహణలో మునిగిపోయారు. ఒక్క రాజధాని హైదరాబాద్‌ నగరం అనే కాకుండా రాష్ట్రమంతటా అప్రమత్తంగా విధులు చేపట్టారు. అడుగడుగునా చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌లు ఏర్పాటు చేశారు. రాత్రంతా, అన్ని రోడ్లమీద, ప్రధాన ప్రాంతాలన్నింటా డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ తనిఖీలు చేపట్టారు. ఇక, నగరంలోని పబ్బులు, నగర శివార్లలోని ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు, రిసార్ట్‌‌‌‌లపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. అంతేకాదు.. ఈసారి గంజాయి, డ్రగ్స్‌‌‌‌ కట్టడికి కూడా స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ నియమించారు. ఇక, న్యూ ఇయర్‌ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్స్‌‌‌‌లో షీ టీమ్స్‌‌‌‌ కూడా నిఘా పెట్టారు.

పై విధంగా అధికారులు, సిబ్బంది విధులు, ప్రత్యేక ఏర్పాట్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కారణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా ముగిసాయి. పోలీసుల ముందస్తు ప్లాన్లు, పర్యవేక్షణతో రోడ్డు ప్రమాదాలు సహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఫలితంగా 2025 స్టార్టింగ్‌డే​ యాక్సిడెంట్​, ఇన్సిడెంట్‌‌ ఫ్రీ ఇయర్ స్టార్టర్‌‌‌‌‌గా నిలిచింది. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.

డిసెంబర్‌ 31వ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన ఆపరేషన్‌..క్యాలెండర్‌ మారిన తర్వాత.. అర్థరాత్రి గడియారం రోజును దాటేసిన తర్వాత జనవరి 1వ తేదీ బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగింది. పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. డిసెంబర్‌‌‌‌ 31 అర్థరాత్రి విధుల్లో దాదాపు 4,500 మంది పోలీసులు డ్యూటీ చేశారు. డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌, డ్రగ్‌‌ డిటెక్షన్‌‌ కిట్స్‌‌తో చెకింగ్‌లు చేపట్టారు. స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కోసం స్టాటిక్, మొబైల్, స్పీడ్ కంట్రోల్ టీమ్స్‌‌ను ఏర్పాటు చేశారు. అర్థరాత్రి సమయంలో వెహికల్ మూవ్ మెంట్స్ ఎక్కువగా ఉండే పబ్స్, హోటల్స్‌‌ రూట్లలో స్టాటిక్ టీమ్స్‌‌తో చెక్ పాయింట్స్ పెట్టారు. డ్రంకెన్ డ్రైవ్ ఎక్కువగా జరిగే ఏరియాల్లో మొబైల్ టీమ్స్‌‌తో రోమింగ్ నిర్వహించారు. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు. దీంతో, 2025 ఏడాది మొదటి రోజే ఇన్సిడెంట్‌‌ఫ్రీ, యాక్సిడెంట్ ఫ్రీ డే గా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కింది.

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌‌, జూబ్లీహిల్స్‌‌, పంజాగుట్ట, హైటెక్‌‌సిటీ, మాదాపూర్‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. డ్రింకింగ్‌ చేసిన వాళ్ల ర్యాష్‌‌ డ్రైవింగ్‌‌ అడ్డుకునేందుకు నగర రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌, పీవీ ఎక్స్‌‌ప్రెస్‌‌వే పైకి హెవీ వెహికల్స్‌‌ మినహా కార్లను అనుమతించలేదు. సిటీ కమిషనరేట్ పరిధి హుస్సేన్‌‌సాగర్‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు స్పీడ్‌‌ కంట్రోల్‌‌ టీమ్స్‌‌ను ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌‌, జూబ్లీహిల్స్ సహా మొత్తం 66 ప్రాంతాల్లో డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ చెకింగ్‌‌ పాయింట్లు ఏర్పాటు చేసి బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టులు నిర్వహించారు.172 జంక్షన్ల దగ్గర పాయింట్‌ ‌డ్యూటీ కానిస్టేబుళ్లను నియమించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే 57 హాట్‌‌స్పాట్లలో, జిగ్‌‌జాగ్‌‌ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో హై స్పీడ్‌‌ డ్రైవ్‌‌ చేయకుండా నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం 30 ఫ్లై ఓవర్లపై స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా వాహనాలను అనుమతించారు. ఫ్లై ఓవర్ల ఎంట్రీ, ఎగ్జిట్ల దగ్గర డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ పరీక్షలు నిర్వహించారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ఔటర్‌ రింగ్‌రోడ్‌, పీవీ ఎక్స్‌‌ప్రెస్‌‌వేపై ప్రత్యేకంగా ఆంక్షలు విధించారు. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ ప్రయాణికుల ‌‌టికెట్లు పరిశీలించి, కారు డ్రైవ్‌‌చేస్తున్న వ్యక్తికి బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేసిన తర్వాతే ఆ రోడ్లపైకి అనుమతించారు.

ఇక, న్యూ ఇయర్‌ అంటేనే ఈవెంట్లు. అందుకే ఈవెంట్లకు సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేకంగా గైడ్‌లైన్స్‌ తయారు చేశారు. వాటిని కచ్చితంగా పాటించేలా పర్యవేక్షించారు. పోలీసుల నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ఈవెంట్లకు అనుమతులు జారీచేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సెక్యూరిటీపై పబ్‌లు, స్టార్ హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్ల‌లో షీ టీమ్స్ తో నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌‌ను ఎప్పటికప్పుడు పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రంకెన్ డ్రైవ్ చెక్ పాయింట్స్ చేపట్టారు.

నగరంలో ఎక్కువగా ప్రమాదాలకు అవకాశాలు ఉన్న హాట్‌‌స్పాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు 550 బ్రీత్‌‌ ఎనలైజర్ల‌తో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2,864 డ్రంకెన్‌‌ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మద్యం మత్తులో ఉన్న వారి వాహనాలను సీజ్ చేశారు. శివారు ప్రాంతాల్లోని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్‌‌‌‌పార్క్, నెక్లెస్ రోడ్స్, ట్యాంక్‌‌బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెకింగ్‌‌లు చేశారు. దీంతోపాటు డ్రంకెన్ డ్రైవ్ కండిషన్‌‌లో సిటీలో ర్యాష్ డ్రైవింగ్ చేసే మందుబాబులకు మొబైల్ టీమ్స్‌‌తో చెక్ పెట్టారు.

సాధారణంగా డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ చెకింగ్స్‌ సమయాల్లో వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగడం, అనుచితంగా ప్రవర్తించడం వంటివి ప్రతిసారీ జరుగుతాయి. అయితే పోలీసులు ఈసారి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎవరైనా అలా చేస్తే ఆధారాలు ఉండేలా బాడీవార్న్‌ కెమెరాలను వినియోగించారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాడీ వార్న్‌ కెమెరాలను ఉపయోగించారు. ఒక్క హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 480 బాడీవార్న్‌‌ కెమెరాలను ఉపయోగించారు. కంట్రోల్‌‌ రూమ్‌‌లోని సర్వర్లకు వాటిని కనెక్ట్‌‌ చేశారు. వాహనాదారులతో మాట్లాడే సమయంలో ఈ కెమెరాలు ఆన్‌‌లో ఉంటాయి. దీంతో పోలీసులు, వాహనదారుల ప్రవర్తనను వీడియో రికార్డింగ్‌‌ ద్వారా గుర్తించేలా ఏర్పాటు చేశారు.

మొత్తానికి 2025 కొత్త సంవత్సరం ప్రశాంతంగా, పాజిటివ్‌ వేవ్స్‌తో మొదలయ్యింది. జీరో ఇన్సిడెంట్, జీరో యాక్సిడెంట్‌లతో తెలంగాణ పోలీసులు కూడా రికార్డు సృష్టించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com