సిఫార్సు లేఖలు లేకుండా ఇక నుంచి నేరుగా టిక్కెట్లు బుక్ చేసే అవకాశం
ప్రజా ప్రతినిధుల కోటాలో ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇకపై ప్రజాప్రతినిధులే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్ధానం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు టీటీడీకి లెటర్లు ఇస్తే ఆ లేఖల్లో పేర్కొన్న వారికి దర్శన ఏర్పాట్లు చేసేవారు. సదరు ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ పొందిన వాళ్ళు టీటీడీ జేఈఓ కార్యాలయంలో ఆ లేఖ సమర్పించి తమ దర్శనాలను ఖరారు చేసుకోవాలి. అయితే ఇకపై ఈ తతంగం లేమీ లేకుండా నేరుగా ప్రజాప్రతినిధులే తాము సిఫార్సు చేసే భక్తుల పేరిట నేరుగా బుక్ చేసి దర్శనాలు కేటాయించవచ్చు. బోర్డు సభ్యుల కోసం గతంలో ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ తయారు చేయించింది టీటీడీ. ఈ సాఫ్ట్ వేర్ సహాయంతో బోర్డు సభ్యుల తమ కోటా మేరకు ఆన్ లైన్లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసి భక్తులకు ఇచ్చేవారు. ఇప్పుడు ఇదే పద్దతిని ప్రజాప్రతినిధులకు కూడా కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ప్రజాప్రతినిధులకే యూజర్ నేమ్, పాస్ వర్డ్ క్రియేట్ చేసి ఇస్తారు. దీంతో వారే నేరుగా ఆన్ లైన్లో తమకు ఇచ్చిన కోటా మేరకు భక్తులకు టిక్కెట్ కేటాయిస్తారు. రోజువారీ కోటాకు మించి టిక్కెట్లు బుక్ చెయ్యాలంటే సాఫ్ట్ వేర్ అనుమతించదు. దీనివల్ల టీటీడీకి చాలా తలనొప్పులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ కోటాకు మించి మూడు నాలుగు సిఫార్సు లేఖలు జారీ చెయ్యడం వల్ల భక్తులు ఆ లేఖలు తీసుకువచ్చి జేఈఓ కార్యలయ సిబ్బందితో వాదోపవాదాలకు దిగుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిరోధించాలంటే ప్రజాప్రతినిధులకే ప్రత్యేక దర్శనం టిక్కెట్లు నేరుగా ఆన్ లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తే కోటకు మించి సిఫార్సులు ఆగిపోతాయని టీటీడీ భావిస్తోంది. దీనివల్ల సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత మంది ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం అవుతుందని టీటీడీ భావిస్తోంది.