ఉత్తరప్రదేశ్‌లోని గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్ వద్ద జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. కుంభమేళాలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం 1,60,000 టెంట్లు, 1,50,000 మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తారు.
మంచి నీళ్ల కోసం 1,250 కిలోమీటర్ల పైప్‌లైనును సిద్ధం చేస్తున్నారు. రాత్రి పూట నగరాన్ని నందనవనంగా మార్చుతున్నారు. ఇందులోభాగంగా 67 వేల ఎల్‌ఈడీ లైట్లు, 2 వేల సోలార్ లైట్లు, 3 లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలు, ఆర్‌ఎఫ్‌ఐడీ రిస్ట్‌బ్యాండ్స్, యాప్ ట్రాకింగ్‌లతో భక్తులను లెక్కిస్తారు. 45 రోజులపాటు సాగే మేళాలో దేశ విదేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
జనవరి 13 పూర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు మహా కుంభ మేళా జరగనుంది. కుంభమేళా సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం పవిత్ర జలంలో ఉంటుందని పురాణాలు చెపుతున్నాయి. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి.