యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇచ్చిన మాట కోసం.. అడుగడుగునా ఎదురైన అడ్డంకులు అధిగమించి తెలంగాణకు ఆత్మగౌరవాన్ని, హక్కులను, ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించిన ధీరోదాత్తుడు డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు తెలంగాణ ప్రణమిల్లి నివాళులర్పిస్తోందని గిరిజన శాఖా మంత్రి సీతక్క అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అరవయ్యేళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మన్మోహన్‌సింగ్ నెరవేర్చారని కొనియాడారు. తెంగాణ అసెంబ్లీలో డాక్టర్ మన్మోహన్‌సింగ్ సంతాప తీర్మానం సందర్బంగా ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను సమున్నతంగా నిలపడంలో మన్మోహన్‌సింగ్ పాత్ర అమోఘమని కొనియాడారు. మాజీ ప్రధానమంత్రుల విప్లవాత్మక సంస్కరణల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన సాహసిగా మన్మోహన్‌సింగ్‌ను అభివర్ణించారు. చట్టాలు, సామాజిక న్యాయ విధానాలు అమలు చేశారన్నారు. దేశచరిత్రలో నిలిచిపోయే సంస్కరణలకు మన్మోహనే ఆద్యుడన్నారు. ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా చట్టబద్ధత కల్పించారని, ఫలితంగా ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉపాధిహామీ చట్టం వల్ల కోట్లాదిమందికి ఉపాధిలభిస్తోందన్నారు. కరోనా సమయంలో పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లిన ప్రజలకు కూడా ఉపాధిహామీ పథకం అందరికీ అన్నంపెట్టిందని, 11 కోట్లమంది కరోనా సమయంలో ఉపాధిహామీ కూలీలుగా ఆకలి తీర్చుకున్నారన్నారు. మౌనముని, మహర్షి, చైతన్యదీప్తి డాక్టర్ మన్మోహన్‌సింగ్ అని కీర్తించారు. సమాచార హక్కు చట్టం కారణంగా సామాన్యులకు కూడా ప్రభుత్వ నిర్ణయాల గురించి తెలుస్తోందని, ప్రభుత్వంలో కూడా పారదర్శకత జవాబుదారీతనం పెరిగిందననారు. 2013లో తెచ్చిన భూసేకరణ చట్టం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. దశాబ్దాలుగా అడవిబిడ్డలకు అడవిమీద హక్కులు రావాలని పోరాటాలు జరుగుతుంటే 2006లో అటవీ హక్కుల చట్టం తెచ్చి పోడుపై అధికారం కల్పించారని గుర్తు చేశారు. ఈ ఘనతలన్నీ మన్మోహన్‌సింగ్‌కే దక్కుతాయన్నారు మంత్రి సీతక్క. ప్రపంచాన్ని అబ్బురపరిచేలా దేశాన్ని ముందుకు నడిపించిన దార్శనికుడు మన్మోహన్‌సింగ్ అన్నారు.