మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిబద్ధత వల్లే ఆనాడు తెలంంగాణరాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారక రామారావు గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసేందుకు ప్రతినిధిబృందంతో కలిసి ఢిల్లీ వెళ్లామని.. ముందుగా తమకు ఐదు నిమిషాల పాటు మాత్రమే సమయం ఇచ్చారని, అయితే, ఆ సమయం సరిపోదని.. కాస్త ఎక్కువ సమయం కావాలని విజ్ఞప్తి చేశామని.. తాము కలిసిన తర్వాత.. సమస్య తీవ్రతను తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారని అప్పటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో దివంగత మన్మోహన్సింగ్ సంతాప సమావేశం సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన నాయకుడు మన్మోహన్సింగ్ అని కొనియాడారు. అయితే, అనేక రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా బరించారన్నారు. మన్మోహన్సింగ్ కాదు.. మౌన మోహన్‌సింగ్ అని కూడా అవమానించారని, అయినా, అవన్నీ పంటి బిగువన బిగబట్టి దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించారన్నారు. దేశాన్ని సంస్కరణల బాట పట్టడంలో మన్మోహన్సింగ్ సేవలు వినియోగించుకున్న తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహరావుకు దేశ రాజధాని న్యూఢిల్లీలో స్మారకం లేకపోవడం బాధాకరమన్నారు. ఢిల్లీలో పీవీ నర్సింహారావు మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసన సభలో తీర్మానం చేయాలని కేటీఆర్ కోరారు.