కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానన్నారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను… దేనికీ భయపడనన్నారు.
జైలుకు వెళ్లి, విడుదలైన అనంతరం తొలిసారి ఈరోజు ఇందూరుకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…తమది భయపడే రక్తం కాదని.. భయపెట్టే రక్తం అన్నారు. తాము తప్పు చేయలేదు… భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని, కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ కేసులకు అంతులేదని..పేరు మర్పిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని అన్నారు.
ప్రభుత్వానికి ఎందుకింత భయమని, బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని కవిత హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయని ఎద్దేవా చేశారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లం .. .గట్టిగా నిలబడుతాం.. ప్రజల పక్షనా పోరాటం చేస్తామని చెప్పారు.
డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వలేదన్నారు. మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని, బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం …. ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదని ధ్వజమెత్తారు.
మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు… ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కవిత పిలుపు ఇచ్చారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి… రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో పోలీసు జులుం నడుస్తున్నదని, కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలని కవిత కోరారు.రాబోయేది గులాబీ జెండా శకమే… అందులో సందేహమే లేదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని..ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదన్నారు.
గురుకులాలను నడపడడానికి కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారు.. ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి యువతను తప్పదోవ పట్టిస్తున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని, తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని కవిత ఆరోపించారు. మన తెలంగాణ తల్లి మనకు కావాలని..తెలంగాణ తల్లి మాదిరా… కాంగ్రెస్ తల్లి మీదిరా…అన్నారు. తెలంగాణ సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నదని, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని కవిత తేల్చిచెప్పారు.