- ప్రముఖుల చిత్రాలతో వినూత్నంగా అసెంబ్లీ కేలండర్
- ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
భారత రాజ్యంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మన తెలుగు ప్రముఖుల వివరాలతో క్యాలండర్ తీసుకురావడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుల చొరవతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముద్రించిన 2025 క్యాలండర్ ను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంవల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘గో బ్యాక్ సైమన్’ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాంతంత్ర్య ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయ సహకారాలు అందించారని కీర్తించారు. అలాగే భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, ఢిల్లీలో పరిపాలన, శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి తెలిపారు. రాజ్యాంగ రచనలో అద్వితీయమైన సేవలందించిన తెలుగు ప్రముఖులు కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, అల్లాడి కృష్ణస్వామి, కల్లూరు సుబ్బారావు, కళా వెంకట రావు, ఆచార్య ఎన్జీ రంగా, మొసలికంటి తిరుమల రావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు, మోటూరి సత్యనారాయణ, దుర్గాబాయి దేశ్ ముఖ్, నీలం సంజీవరెడ్డి, విసి.కేశవరావుల చిత్ర పటాలతో పాటు, ఆనాడు సభలో వారు చేసిన ప్రసంగాంశాలను లభ్యమైన మేరకు ఈ కేలెండర్లో పొందుపరచారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామకృష్ణరాజు, రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.