33.4 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

దండాలయ్యా…! రోహితయ్య…

బాక్సింగ్ డే టెస్ట్ రెండు రోజుల ఆట చూసిన తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ నోటి నుంచి వచ్చే మాట ఇది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలోని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌ రోహిత్ ఆడలేదు. కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించాడు. మ్యాచ్ గెలిచాడు. కొడుకు పుట్టడంతో ఆ టెస్ట్ ఆడలేదు రోహిత్. ఇక రెండో టెస్ట్‌ నుంచి అందుబాటులోకి వచ్చిన రోహిత్‌ అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా వరుసగా ఫెయిలయ్యాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో రోహిత్ స్కోర్ చూస్తే అత్యంత దారుణమని చెప్పాలి. వరుసగా ఫెయిలయ్యాడు. పోనీ మ్యాచ్‌లను గెలిపించి కెప్టెన్‌గా అయిన సక్సెస్ అయ్యాడా అంటే అదీ లేదు. అతను లేని ఫస్ట్ టెస్ట్‌ తప్ప టీమిండియా గెలిచింది లేదు. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్‌కు చేరడంపై అనేక అనుమానాలున్న సమయంలో మనం ఆడేది లేదని తెగేసి చెప్పినట్టుంది రోహిత్ కెప్టెన్సీ, అతని ఫామ్.

అంతేకాదు రోహిత్ రెండో టెస్ట్ ఆడేందుకు ముందు ఓ మాట అన్నాడు. ఓపెనర్లుగా రాణిస్తున్న జైశ్వాల్-రాహుల్ జోడిని వీడదీయనని. కానీ నాలుగో టెస్ట్‌లో ఆ మాటను కాస్త అటకెక్కించేశాడు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చి విఫలమవుతున్నాను కాబట్టి.. ఓపెనర్‌గా వచ్చి దుమ్ము లేపేస్తానని చెప్పకనే చెబుతూ క్రీజులోకి వచ్చాడు. కానీ వచ్చినంత టైమ్ పట్టలేదు తిరగి వెళ్లడానికి. కేవలం మూడంటే మూడే పరుగులు చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. సో ఇచ్చిన మాట పోయింది.. పరుగులు చేయకపోవడంతో పరువూ పోయింది.

మెల్‌బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ ఆడింది కేవలం ఐదంటే ఐదే బాల్స్. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఆ షాట్ అసలు ఎందుకు ఆడాడో, ఎలా ఆడాడో కనీసం తనకైనా అర్థమైతే సంతోషమే. కమిన్స్ రావడం.. రోహిత్‌ను ఔట్ చేయడం ఇప్పుడు రోటిన్‌గా మారిపోయింది.  ఈ టెస్ట్ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ చేసిన పరుగులు 22. రెండో టెస్టులో 3, 6 పరుగులు.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులు. ఇక తాజాగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు. ఇది రోహిత్ ట్రాక్ రికార్డ్.

క్రీజులో పాతుకుపోదామన్న కసి కనిపించడం లేదు.. ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టిస్తాడన్న ఆశ కూడా కనిపించడం లేదు. త్వరగా ఔట్ అవ్వడం.. ఇతర బ్యాట్స్‌మెన్‌పై ప్రెజర్ పెంచడం ఇప్పుడు రోటిన్‌గా మారింది.  ఓవరాల్‌గా  టీమ్ ఫెయిల్యూర్‌కు రోహిత్ ఓ రీజన్‌గా మారుతున్నాడన్న చర్చ మొదలైంది. ఇక కెప్టెన్‌గా రోహిత్‌ తీసుకున్న ఓ చెత్త నిర్ణయం నైట్ వాచ్‌మెన్‌గా ఆకాష్‌ దీప్‌ను పంపడం అని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే రోహిత్ ఆటపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో మరోసారి అతని రిటైర్మెంట్‌పై ప్రచారం మొదలైంది. సిడ్నీ టెస్ట్ తర్వాత రోహిత్ టెస్ట్‌లకు కూడా గుడ్ బై చెబుతారన్న చర్చ మొదలైంది. అంతేకాదు అసలు సిడ్నీ టెస్ట్ కూడా ఆడే అవకాశం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. అశ్విన్‌తో పాటు నువ్వు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తే హుందాగా ఉండేది… ఇప్పుడు ఇన్ని అవమానాలతో ఆటకు చరమగీతం పాడటం అవసరమా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఓ మాట మాత్రం నిజం. రోహిత్ తప్పుకోగానే టీమ్‌లో చోటు సంపాదించేందుకు యువరక్తం సిద్ధంగా ఉంది. అయితే వారి వద్ద అనుభవం లేకపోవడం కాస్త లోటే అయినా.. భారంగా మాత్రం ఉండరన్నది నిజం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com