32.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

విద్యుత్‌ చార్జీల పెంపుపై వైఎస్‌ఆర్‌ సీపీ పోరాటం

– రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
– ఎక్కడికక్కడ ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలనాతీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కన్నెర్ర చేసింది. ప్రధానంగా ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడంపై ప్రతిపక్ష పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని ఓటర్లను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటలు తుంగలో తొక్కిందని వైసీపీ ఆరోపించింది. ప్రజలపై 15,485.36 కోట్ల రూపాయల భారాన్ని మోపి చంద్రబాబు చోద్యం చూస్తున్నారని విమర్శించింది. కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పిలుపుతో.. పార్టీ శ్రేణులు కదం తొక్కారు. రాష్ట్ర‌ వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేప‌ట్టారు.

నగరిలో రోజా నిరసన :

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పుత్తూరు ఆరేటమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన రోజా.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డీఈఈ కార్యాలయం వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. కరెంటు చార్జీలు తగ్గించాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.

కాకినాడలో పోరుబాట :

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. కాకినాడ జిల్లా యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు తెలిపారు. కాకినాడ విద్యుత్ డీఈఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నగర వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి డీఈఈ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ పోరుబాటలో కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే, తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పిఠాపురంలో వంగా గీతా, పెద్దాపురంలో దవులూరి దొరబాబు, జగ్గంపేటలో తోట నరసింహం ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించారు.

విశాఖలో ఆందోళన :

రాష్ట్రంలో ప్రజలపై విద్యుత్ ఛార్జీల బాదుడిపై విశాఖలోనూ వైసీపీ నేతలు పోరుబాట నిర్వహించారు. సౌత్ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలులో కార్యకర్తల కన్నెర్ర :

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపించింది. కూటమి సర్కారు నిర్ణయాలను నిరసిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు కర్నూలులో పోరుబాటపట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసన తెలిపారు. కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను మరిచిపోయి.. విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

అనంతపురంలో ఆగ్రహజ్వాలలు :

అనంతపురం జిల్లాలోని విద్యుత్ కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని బ్రహ్మంగారి ఆలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com