మృదు స్వభావి మన్మోహన్ ఎంతలా సంస్కర్తలా పేరు పడ్డారో రెండో సారి పాలనలో తన మంత్రివర్గ సహచరులపై తీవ్ర స్ధాయిలో అవినీతి అరోపణలు వచ్చాయి. యూపీఏ2 హయాం మొత్తం అవినీతి పుట్టగా పేరుతెచ్చకుంది. మన్మోహన్ క్యాబినేట్ లోని పలువురు మంత్రులు, భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు పార్లమెంట్ సభ్యులు కూడా అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం పైనా పడనన్ని ఆరోపణలు మన్మోహన్ రెండో సారి ప్రధానిగా చేసిన కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా టూజీ స్కామ్ ఆ తర్వాత బొగ్గు కుంభకోణం.. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కామ్, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం ఇలా స్కామ్ ల పరంపర ఎదుర్కొంది మన్మోహన్ ప్రభుత్వం. అయితే మన్మోహన్ సింగ్ హయాంలో ఇన్ని స్కాములు బయటపడినప్పటికీ వ్యక్తిగతంగా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే సాహసం ప్రతిపక్ష పార్టీలు ఏవీ చెయ్యలేకపోయాయి. తన క్యాబినేట్ సహచరులపై భారీ స్ధాయిలో అవినీతి ఆరోపణలు వచ్చినా వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ కు అవినీతి మకిలి అంటలేదు. ప్రతిపక్షాలకే కాదు ప్రజల్లో కూడా మన్మోహన్ నీతివంతమైన వ్యక్తిత్వంపై అచంచలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం. అయినా కూడా తన క్యాబినేట్ సహచరులు చేసిన అవినీతి వ్యవహరాలపై ఎంతోకొంత మన్మోహన్ సింగ్ కూడా నైతికంగా బాధ్యత వహించాల్సి వచ్చింది.
పరువు తీసిన 2జీ స్కామ్
తొలి ఐదేళ్లు అద్భుతమైన పాలనాదక్షుడుగా పేరు పడిన మన్మోహన్ రెండోసారి గద్దె నెక్కాక తన ప్రభుత్వంలో అవినీతిని అరికట్టలేకపోయారనే అపవాదు ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన 2జీ స్కామ్ లో ఏకంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వాధికారులు, కొందరు ప్రభుత్వంలోని రాజకీయ నేతలు కలసి 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల జారీలో అవినీతికి పాల్పడ్డారన్నది అభియోగం. అప్పటి కేంద్ర మంత్రి రాజానే ఇందులో ఇరుక్కోవడం సంచలనం సృష్టించింది. కొందరు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు అతి తక్కువ ధరకు వేలంలో 122లైసెన్సులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఇదే కేసులో ఏ. రాజా, కనిమోళి, సన్ టీవీ ప్రతినిధులు, దయానిధి మారన్ లాంటి వారు కటకటాల పాలయ్యారు.
బొగ్గు కుంభకోణం
ప్రైవేట్, పబ్లిక్ సెక్టర్ కంపెనీలకు బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కోల్ గేట్ స్కామ్ బయటకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.86 ట్రిలియన్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరోవైపు కోల్ కంపెనీలు బొగ్గు తవ్వకాలను చేపట్టడానికి మొరాయించాయి. దాంతో ప్రభుత్వం బొగ్గు కొరతను అధిగమించడానికి విదేశాలనుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత పరిణామాల్లో 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు కొట్టేసింది. అప్పట్లో ఈ శాఖకు సహాయ మంత్రిగా ఉన్న తెలుగుదర్శకుడు దాసరి నారాయణ రావు కూడా ఇదే స్కామ్ లో పలు విచారణలు ఎదుర్కొన్నారు.
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ
యుద్ధంలో చనిపోయిన సైనికాధికారుల వితంతువులకు, ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సిబ్బంది కోసం మహారాష్ట్ర ముంబైలోని కోలాబాలో నిర్మించిన 31 అంతస్తుల అపార్టుమెంట్ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అవకతవకలు మన్మోహన్ ప్రభుత్వ పరువు తీశాయి. కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాలకు రావాల్సిన ఆ ఇళ్లను అసలు రక్షణ రంగంతో సంబంధం లేని బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు పొందడం విమర్శలకు తావిచ్చింది. 2003లో జరిగిన ఈ కుంభకోణం మన్మోహన్ ప్రభుత్వం పరువు తీసేసింది.
కామన్ వెల్త్ గేమ్స్ స్కామ్
2010లో జరిగిన ఈ కుంభకోణం అంతర్జాతీయ వేదికలపైనా భారత్ పరువు తీసేసింది. విదేశీ అతిధులకు ఆతిధ్యమిచ్చే విషయంలో, క్రీడాపరికరాల కొనుగోలులో, గేమ్స్ నిర్వహణ వ్యయం కోసం ఖర్చు పెట్టిన లెక్కల్లో తీవ్రమైన గోల్ మాల్ జరిగింది. దేశం కోసం ఆడే క్రీడాకారులను అవమానించే విధంగా వారందరినీ అరకొర వసతులతో కూడిన భవనాల్లో ఉంచుతూ మిగిలిన వారికి విదేశీ అతిధులు, టూరిస్టులకు ఇష్టానుసారం గదులు కట్టబెట్టడం లాంటివి యూపీఏ ప్రభుత్వం పరువు తీసి పాతరేశాయి. దాదాపు 70 వేల కోట్ల రూపాయలను దళారులు మింగేశారు.
ఇలా మన్మోహన్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టాక లెక్కలేనన్ని స్కామ్ లలో కూరుకుపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, బ్యూరోక్రాట్లు నేరాలు చేస్తే బాధ్యత మాత్రం మన్మోహన్ పై పడింది. ఆయన అసమర్ధుడనీ, చేతకానివాడనీ అనేక మంది విమర్శలు చేశారు. వీటన్నింటినీ పాపాల భైరవుడులా భరించిన మన్మోహన్ అప్పట్లో చెప్పినది ఒక్కటే. ప్రభుత్వ వ్యవస్థలోని విషయాలన్నీ బయటకు చెప్పలేను. కానీ సంకీర్ణ ప్రభుత్వాల అనివార్యతలను దృష్టిలో ఉంచుకుని ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో అలాగే నడచుకున్నా అని. ఏదిఏమైనా వ్యక్తిగతంగా ఎటువంటి మచ్చలేని దార్శనిక ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ అనేది నిర్వివాదాంశం.