ప్రధాని నరేంద్రమోడీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం మన్మోహన్ నివాశానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్ ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అలాగే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలు మన్మోహన్ నివాశానికి చేరుకుని ఆయన పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ ని పరామర్శించారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు కూడా విడివిడిగా మాజీ ప్రధాని పార్థివదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నాయకులు, పలువురు మంత్రులు మన్మోహన్ సింగ్ తో వ్యక్తిగత అనుబంధం ఉన్న నేతలు చాలా మంది ఢిల్లీ వెళ్లి మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు.