దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్ల మార్పులు, చేర్పులు, కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయగా.. రెండు రాస్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియామకాలకు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా ఉన్న డాక్టర్ కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా బదిలీ చేశారు. బీహార్ గవర్నర్‌గా కొనసాగుతోన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా నియమించారు. ఇప్పుడు కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బీహార్‌కు బదిలీ చేశారు. మిజోరాం గవర్నర్‌గా జనరల్ విజయ్‌కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ భల్లాను నియమించారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
ఇక, ఆంధ్రప్రదేశ్‌కు చెంది కంభంపాటి హరిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత అదే యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి 1993లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి ఏపీ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. 2021 జూలైలో తొలిసారి మిజోరాం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ రాజీనామా చేయడంతో హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు.