విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక (సీఎంపి) సిద్దం చేసినట్లు పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేసారు…ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు..కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తామన్నారు..అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు,పీజీవీఆర్ నాయుడు,వెలగపూడి రామకృష్ణ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలకత్తా మెట్రో రైల్ తరహాలో వందశాతం కేంద్రప్రభుత్వం భరించేలా రైల్వే శాఖకు అప్పగించేలా కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచామన్నారు. రెండు దశల్లో నాలుగు కారిడార్లలో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు.మొదటి దశలో 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో నిర్మాణం చేస్తామన్నారు..మొదటి కారిడార్ ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకూ 34.4 కిమీ మేర రెండో కారిడార్ లో గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకూ 5.07 కిమీ మేర మూడో కారిడార్ లో తాటిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.75 కిమీ మేర ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్దం చేసామన్నారు.మొత్తంగా 46.23 కిమీ మేర 42 స్టేషన్లతో నిర్మించే ప్రాజెక్ట్ కు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచానా వేసామన్నారు.ఇక రెండో దశలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ 30.67 కిమీ మేర 12 స్టేషన్ల తో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసామన్నారు మంత్రి నారాయణ.