మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఒక లెజెండ్. తను వచ్చిన తర్వాత ఇండియన్ క్రికెట్ కొత్త పుంతలు తొక్కింది. తన హయాంలో ఎందరో యువ క్రికెటర్లు రాణించారు. అలాంటి వారిలో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలాంటి వాళ్లున్నారు. ఇదిలా ఉండగా రవిచంద్రన్ అశ్విన్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే ఆయన హఠాత్తు నిర్ణయం తీసుకున్నాడు. మరెందుకిలా జరిగిందో తెలీదు.
డ్రెస్సింగ్ రూమ్ లో ఏదైనా చర్చకు వచ్చిందా? లేక ఎవరైనా ఏమైనా అన్నారా? కోచ్, కెప్టెన్ వయసు మీరిన అశ్విన్ ను చూసి ఇబ్బంది పడుతున్నారా? అనేది తెలీదు. మొత్తానికి సడన్ గా టూర్ మధ్యలో చెప్పి, విమానమెక్కి ఇండియా వచ్చేశాడు. అయితే ఇప్పుడెవరూ చెప్పరు. కానీ నేడు జట్టులో ఉన్నవారు రిటైర్ అయిన తర్వాత, తప్పకుండా అసలేం జరిగిందనేది చెబుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే 38 ఏళ్ల అశ్విన్ చాలా ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. విరాట్ కొహ్లీకి తను మంచి స్నేహితుడు కూడా. ఈ నేపథ్యంలో తొలిసారి తను ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో అంశాలు పంచుకున్నాడు. అలాగే రిటైర్మెంట్ పై కూడా స్పందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
అందరి కెప్టెన్లలా ధోనీ ఉండడని తెలిపాడు. తనలో ఒక స్పెషాలిటీ ఉంటుందని అన్నాడు. అదేమిటో కూడా ఉదాహరణలు తెలిపాడు. ముఖ్యంగా తను బౌలర్ కి బాల్ ఇచ్చిన తర్వాత, తనకు నచ్చినట్టు ఫీల్డింగ్ సెట్ చేసుకోమని అంటాడు. ఫలానా బాల్ వేయమని చెప్పడు.
భారం అంతా బౌలర్ పైనే పెడతాడు. అతనికి పూర్తి స్వేచ్ఛనిస్తాడని అన్నాడు.
ఇది చాలామంది కెప్టెన్లలో కనిపించదని చెప్పాడు. అంతా వారికి నచ్చినట్టు బౌలింగు చేయాలని అంటారని అన్నాడు. ఇంకా చెప్పాలంటే బాల్ ఎలా వేయాలో వారే సలహాలిస్తుంటారని అన్నాడు. దీనివల్ల బౌలర్ సహజత్వం దెబ్బతింటుందని వివరించాడు.
ఇంత విపులంగా అశ్విన్ ఎందుకన్నాడు? బహుశా ఇది రోహిత్ శర్మని ఉద్దేశించే చెప్పి ఉండవచ్చునని అనుకుంటున్నారు. ఎందుకంటే రోహిత్ ఇలాగే బౌలర్లను గైడ్ చేస్తుంటాడు. ఫీల్డింగ్ కూడా తనకి నచ్చినట్టుగానే పెట్టి, బౌలర్లను ఆ తరహా బౌలింగు చేయమని ఆదేశిస్తుంటాడని గుర్తు చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులోనే సిరాజ్ రౌండ్ ద వికెట్ వేస్తానంటే ఆపడం, అప్పుడు కొహ్లీ వచ్చి సర్ది చెప్పడం అందరికీ తెలిసిందే. అలా వేసి సిరాజ్ వికెట్ కూడా తీయడం విశేషం.
ఇదే టెక్నిక్ ధోనీ చేస్తుంటాడని అశ్విన్ అన్నాడు. అయితే, మరి ధోని కోప్పడడా? అంటే ఎందుకు కోప్పడడని నవ్వుతూ అన్నాడు. ఒకొక్కసారి బౌలర్ల లూజ్ బాల్స్ వేసినా ఏమీ అనడు. అక్కడ బ్యాటర్లు బౌండరీ కొట్టినా మాట్లాడడు. అలాగే వెంటనే బౌలింగ్ నుంచి తప్పించడు.
కానీ ఎప్పుడైతే, నా బౌలింగ్లో ఎవరైనా కట్ షాట్ లేదా లేట్ డ్రైవ్ షాట్ ఆడితే మాత్రం ధోనీకి కోపం వస్తుంది. వెంటనే బౌలింగు మార్చేస్తాడు. కొత్త బౌలర్ కి బంతిని అందిస్తాడు. ఇలా తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని సక్సెస్ అయ్యాడని వివరించాడు. మొత్తానికి ఏం జరిగిందో తెలీదు. అశ్విన్ మాత్రం అనామకుడిలా రిటైర్మెంట్ ఇవ్వడం క్రికెట్ ప్రేమికులు అందరికీ బాధాకరంగా అనిపించింది.