సమాజంలో సినిమా రంగం చెరగని ముద్ర వేసుకుంది. ప్రజల వినోదానికి సినిమా అనేది ఓ వాహకంగా దశాబ్దాల నుంచి సేవలందిస్తోంది. మన దేశంలో సినిమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 20వ దశాబ్దం మొదట్లో మూకీ సినిమాలతో మొదలైన భారతీయ సినిమాల పయనం.. ఇప్పుడు ఖండాంతర ఖ్యాతిని సంతరించుకున్నాయి. ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డుల స్థాయికి చేరుకున్నాయి. అయితే, మన దేశంలోనూ ఎక్కువగా సినిమాను ఆదరిస్తున్నది తెలుగు వాళ్లే. ఇప్పుడైతే టీవీలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, మొబైల్ ఫోన్స్ వచ్చాయి. కానీ, ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లే దిక్కు. తొలిరోజు తొలి ఆట నుంచి మొదలుకొంటే వందరోజులు ఆడిన సినిమా అయినా థియేటర్‌కు వెళ్లిచూస్తేనే అదో థ్రిల్. వేరే ఆప్షన్ కూడా ఉండేది కాదు.. అయితే, ఇటీవలే సినిమా థియేటర్లకు సంబంధించిన గణాంకాలు బయటకు వచ్చాయి. వీటిని బట్టి చూస్తే.. మనదేశంలో సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నది ఆంధ్రప్రదేశ్ వాసులే అన్న విషయం మరోసారి నిరూపితమయ్యింది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేనన్ని సినిమా థియేటర్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి.
మనదేశంలో మొత్తం 6,877 సినిమా థియేటర్లు ఉన్నాయి. వాటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 1,097 టాకీసులున్నాయి. మన పక్క రాష్ట్రం తమిళనాడులో 942 సినిమా థియేటర్లు, కర్ణాటకలో 719 సినిమా టాకీసులు, మహారాష్ట్రలో 703 థియేటర్లు, తెలంగాణలో 485 సినిమా టాకీసులు, గుజరాత్లో 420 సినిమా థియేటర్లు, బెంగాల్ 373 థియేటర్లు, ఉత్తరప్రదేశ్ లో 321 టాకీసులు, బీహార్ లో 315 సినిమా థియేటర్లు, మధ్యప్రదేశ్ లో 188 సినిమా థియేటర్లు, రాజస్థాన్ లో 178 థియేటర్లు, ఒడిశాలో 141 థియేటర్లు ఉన్నాయి. ఇక, మిగిలిన రాష్ట్రాల్లో వందలోపే సినిమా థియేటర్లు ఉన్నాయని తేలింది. ఇక, సినిమా టాకీసుల సంఖ్యలో టాప్ 5 లో నాలుగు స్థానాలు దక్షిణాది రాష్ట్రాలే ఉండడం కూడా సినిమాల పట్ల దక్షిణాది ప్రేక్షకులకు ఉన్న అనుబంధం ఏంటో చెప్పకనే చెబుతోంది.