బీసీసీఐ దెబ్బకు ఇప్పటికే దిగొచ్చింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. చాంపియన్స్ ట్రోఫి ఆడేందుకు పాకిస్థాన్‌కు వచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించింది. అయితే తటస్థ వేదికగా శ్రీలంక లేదా యూఏఈని సెలెక్ట్ చేసుకునేందుకు ఐసీసీ ఆప్షన్స్ ఇవ్వడంతో.. పీసీబీ యూఏఈని ఎంచుకుంది. ఇకపై భారత్ ఆడే మ్యాచ్‌లన్ని యూఏఈలో జరగనున్నాయి.
అయితే చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాదు.. 2027 వరకు జరగబోయే భారత్, పాక్ మ్యాచ్‌లన్ని తటస్థ వేదికలపైనే జరగనున్నాయి. ఈ కండిషన్ పీసీబీ విధించిందే. దీనికి ఐసీసీ అంగీకరించింది. ఈ నిర్ణయంతో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్‌కు పాకిస్థాన్ టీమ్ మన దేశానికి రాదు. 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్, 2026లో భారత్, శ్రీలంక హోస్ట్ చేసే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్, 2028లో పాకిస్థాన్‌లో జరిగే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ కూడా తటస్థ వేదికల్లోనే జరుగుతాయి.
అయితే ఈ మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించాలన్నది హోస్ట్ చేసే దేశాలు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫి విషయంలో పీసీబీ ఎలాగైతే నిర్ణయం తీసుకుందో.. అలాగే భారత్ హోస్ట్ చేసే ఈవెంట్స్‌కు బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక చాంపియన్స్ ట్రోఫికి తటస్థ వేదిక యూఏఈ అని తేలిపోవడంతో షెడ్యూల్ ప్రిపరేషన్‌లో పడింది పీసీబీ, ఐసీసీ. ఈ ట్రోఫీ 2025ను ఫిబ్రవరి-మార్చిలలో ఆడాల్సి ఉంది.