ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసంపై దాడి చేసిన ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరయ్యింది. ఆదివారం దాడి చేసే సమయంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ లను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులన సోమవారం ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరికి వెంటనే బెయిల్ మంజూరయ్యింది. నిందితులపై బీఎన్ఎస్ 131, 126(2), 190,191(2), 292, 324(2), 331(5) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం ఓయూ జేఏసీ పేరుతో కొంత మంది యువకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో అల్లు అర్జున్ నివాసంలో పూల కుండీలు బద్దలు కొట్టడమే కాకుండా ఆయన ఇంటిపై రాళ్ళు రువ్వారు. దాడిని అడ్డుకుంటున్న అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బందిపై కూడా ఆ యువకులు దాడి చేశారు. ఈ దాడిపై అల్లు అరవింద్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.