- కేసు నమోదు చేసిన జడ్జి రాజీనామా?
- ట్రంప్ సర్కార్ నుంచి మరో అటార్నీకి అవకాశం..
అదానీ గ్రూప్ పై అమెరికాలో నమోదైన కేసు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదానీ గ్రూపు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ ను మోసగించిందని , అవకతవకలు, మోసాలు పాల్పడిందని ఆరోపణలు చేసిన అటార్నీ బ్రియాన్ పీస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా జనవరి 10 నుంచి అమల్లోకి వస్తుంది. 2021లో జో బైడెన్ ప్రభుత్వం నియమించి ఈ జడ్జి తన పదవీ కాలానికన్నా ముందే రాజీనామా సమర్పించడం గమనార్హం. డోనాల్డ్ ట్రంప్ జనవరి 20 పగ్గాలు చేపట్టనుండగా, అంతకన్నా ముందే అంటే జనవరి 10 నే బ్రియాన్ పీస్ తప్పుకుంటున్నారు. బ్రియాన్ పీస్ స్థానంలో కెరోలిన్ పొకోర్ని యూఎస్ తొలి అసిస్టెంట్ అటార్నీగా తాత్కాలికంగా నియమితులవుతారు.
ఆర్ధిక నేరానికి పాల్పడిందని అభియోగం
నవంబర్ నెలలో అదానీ గ్రూపుకు చెందిన డైరక్టర్లు గౌతమ్ అదానీతో సహా అనేక మంది గ్రీన్ ఎనర్జీ కంపెనీకి లబ్ది చేకూరే విధంగా భారత్ లో అనేక రాష్ట్రాలకు ముడుపులిచ్చి కాంట్రాక్టు దక్కించుకున్నారన్న ఆరోపణలు చేస్తూ ఇది అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను, అమెరికా ప్రజలను మోసగించడమేనని బ్రియాన్ పీస్ కార్యాలయం ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. తమ కంపెనీ గురించి సరైన సమాచారం లేకుండానే , ఆధారాలు చూపకుండానే నిరాధార ఆరోపణలు చేసి కంపెనీ పరువు తీశారంటూ అదానీ గ్రూప్ ప్రకటన చేసింది. డైరక్టర్లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ ఎలాంటి తప్పిదాలకు పాల్పడ లేదని అదానీ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.
అసత్య ఆరోపణలతో మా కంపెనీకి నష్టం.. అదానీ
నిరాధారమైన ఆరోపణల వల్ల, తప్పుడు ఆరోపణల వల్ల భారతీయ దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అనేక అంతర్జాతీయ కాంట్రాక్టులు రద్దయ్యాయని, భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపాయని, వ్యూహాత్మక వాణిజ్య భాగస్వాములు, పెట్టుబడి దారులు, ప్రజలు కూడా తమ కంపెనీని అనుమానించారని అదానీ గ్రూప్ పేర్కొంది.
అదానీ గ్రూప్ లో అది 10 శాతం
యూఎస్ ప్రభుత్వం చెబుతున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఆ కంపెనీ ఇతర వ్యాపారాల్లో కేవలం పది శాతం మాత్రమేనని, తమకు చెందిన మరో 11 పబ్లిక్ కంపెనీలపై ఒక్క నేరమూ, అవకతవకలూ నమోదు కాలేదని అదానీ గ్రూప్ ప్రకటించింది.