కొడాలి నాని… వల్లభనేని వంశీ… అనిల్ కుమార్ యాదవ్… ఆర్కేరోజా… వీళ్లంతా వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్… కాదు… కాదు.. వైల్డ్ ఫైర్ బ్రాండ్ నాయకులు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థుపై నిప్పులు చెరిగే వారు. బూతుల మంత్రులని వీళ్ళకు అప్పటి ప్రతిపక్ష పార్టీలు పేర్లు కూడా పెట్టాయి. వైఎస్సార్సీపీ అంత ఘోరంగా ఓడిపోవడానికి ఈ నలుగురి నోటి దూల కూడా ఒక కారణమని చాలా మంది పార్టీ కార్యకర్తల అభిప్రాయం. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లపై ఈ నలుగురు నాయకులు ప్రవర్తించిన తీరు పట్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చిందనే వాదన కూడా ఉంది. అయితే ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలు అయినట్లు ఆ నలుగురు మాజీలు 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై తిరిగి శాసనసభకు కూడా రాలేకపోయారు. అప్పటి నుంచి ఈ నలుగురు పెద్దగా ప్రజల్లోకి రావడం కానీ ఆఖరికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కానీ చెయ్యలేదు. ఈ పరిస్ధితుల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కేరోజాలు ఎక్కడా అని ప్రశ్న రాజకీయవర్గాల్లో ఎదురవుతోంది. అధికార కూటమి సోషల్ మీడియా కార్యకర్తలైతే వీరిని లాపతా లీడర్స్ అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పేరు వింటేనే పూనకాలు వచ్చేవి. విలేకరులు ఈయన ముందు మైకు పెట్టి ఏదైనా ప్రశ్న అడిగితే తిప్పి తిప్పి చంద్రబాబు మీదకు తీసుకు వచ్చి ఆయనపై విరుచుకుపడే వారు. అప్పట్లో కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబును తిడుతుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలందరికీ వీనుల విందుగా ఉండేది. ఆయన ప్రెస్ మీట్లకు పార్టీలో అంత క్రేజ్ ఉండేది. అడ్డూ అదుపూ లేకుండా ఎంతమాట పడితే అంతమాట చంద్రబాబును అనేవారు.. ఈవిషయంలో నారా లోకేష్ ను కూడా కొడాలి నాని విడిచిపెట్టే వారు కాదు. అంతటి ఫైర్ బ్రాండ్ లీడర్ కాస్తా ఇప్పుడు ఓటమి పాలయ్యాక దాదాపు అజ్ఞాతంవాసం గడుపుతున్నారు. ఇక కృష్ణా జిల్లాకే చెందిన మరో మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కూడీ చంద్రబాబు, లోకేష్ల పేరు ఎత్తితే మీడియా ముందు అగ్గిమీద గుగ్గిలం అయిపోయేవారు. కృష్ణా జిల్లా మాండలికంలో పరుష పదాలు కలగలిపి బాబు, లోకేష్లపై విరుచుకుపడేవారు. ఈయన ప్రెస్ మీట్లు కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సమ్మగా ఉండేవి. వంశీ కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత నుంచి లాపతా. అంతకు ముందు ఆ అంటే మీడియా ముందుకు ఊ అంటే మీడియా ముందుకు వచ్చి అత్యంత శౌర్య, పరాక్రమాలు కనబరిచిన ఈ ఇరువురు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఇప్పుడు జనజీవన స్రవంతిలో కంటికి కనిపించకుండా మాయమైపోయారు.
ఇక మారో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా చంద్రబాబు, వపన్ కళ్యాణ్, లోకేష్ లను తిట్టడంలో ముందుండేవారు. ఏ సందర్భం వచ్చినా మీడియా ముందకు వచ్చి ఈ ముగ్గురిపై విరుచుకు పడటమేకాంకుడా తొడలు కొట్టి మరీ సవాళ్ళు విసిరేవారు. వైఎస్సార్సీపీ వైల్డ్ ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఈయన కూడా ఒకరు. అటు అసెంబ్లీలో అయినా ఇటు ప్రజా బాహుళ్యంలో అయినా మైకు ముందకు వచ్చారంటే వీరావేశంతో మాట్లాడేవారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై ఒంటికాలిపై లేచేవారు. దురదృష్టవశాత్తూ మొన్న మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఈయన కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి అప్పుడప్పుకు చుక్కల్లో చంద్రుడిలా వచ్చిపోవటం తప్పితే గతంలో ఉన్నంత ఫైర్ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లో కనిపించడం లేదని వైఎస్సార్సీపీ శ్రేణులు బాధపడుతున్నాయి. అలాగే మరో ఫైర్ బ్రాండ్ మహిళా నేత.. ఎంతమందిలో ఉన్న అందర్నీ తన ప్రసంగంతో ఆకట్టుకునే నాయకురాలు ఆర్కేరోజా. మంత్రిగా పనిచేసినప్పుడైనా అంతకు ముందు అధికార పార్టీ శాసనసభ్యురాలిగా ఉన్నా, చివరికి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ప్రత్యర్ధులకు తన వాగ్ధాటితో నిద్ర పట్టకుండా చేసేవారు ఆర్కేరోజా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సభలో రోజా ఉంటే ఇబ్బందని సుదీర్ఘకాలం సస్పెండ్ చేసింది 2014నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఆ తరవాత అధికారంలోకి వచ్చాక రోజా తన విమర్శలకు మరింత పదును పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై వ్యక్తిగతంగా కూడా మాట్లాడేవారు. మీడియా ముందకు వచ్చారంటే ఈ ముగ్గురు ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చెయ్యడమే కాంకుడా వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు.
అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఎక్కువ ఫీడ్ నాని, వంశీ, అనిల్, రోజాలే ఇచ్చేవారు. మిగితా చాలా మంది నేతలు ప్రతిపక్ష నేతలపైన విమర్శలు చేసినా పార్టీలో ఈ నలుగురికీ వచ్చినంత గ్లామర్ ఇతరులకి రాలేదు. అంబటి రాంబాబు కూడా వీరి స్ధాయలో గ్లామర్ సాధించారు… అయితే ఆయన అప్పుడు ఇప్పుడూ ఒకేలా యవర్ యాక్టీవ్ గా ఉన్నారు. ఓడిపోయినంత మాత్రమన అంబటి అజ్ఞాతంలోకి జారుకోలేదు… ఇంతకు ముందుకన్నా ఎక్కువ బాధ్యతతో సమర్ధవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఓ పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తోంది. పలువురిపై పోలీసు కేసులు పెట్టి వేధిస్తోంది. ఈదశలో పార్టీలో హీరోయిక్ ఇమేజ్ ఉన్న ఈ నలుగురు రాష్ట్రం మొత్తం కలియతిరుగుతూ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాల్సింది పోయి ఎవరికీ కనిపించకుండా తిరుగుతుండటం వైఎష్సార్సీపీ అభిమానులకు మింగుడు పడటం లేదు. ఇదే సమయంలో ఈ నలుగురు నాయకులపై తెలగుతమ్ముళ్ళు విపరీతమైన కసిగా ఉన్నమాట వాస్తవం. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నాని, వంశీలతో పాటు అనిల్, రోజాలను ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపకపోవడంపై చంద్రబాబు, లోకేష్ల మీద హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు టీడీపీ అగ్రనాయత్వం కూడా ఈ నలుగురినీ ఏదోరకంగా ఇబ్బందులు పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా అధికార పక్ష ప్రతీకార చర్యలకు వెరవకుండా ప్రతిపక్షంలో సైతం అదే ఉత్సాహంతో పనిచేస్తారని ఈ నలుగురిపై వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెట్టకున్న ఆశలు అడియాశలే అయ్యాయని చెప్పక తప్పదు.