సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అభ్యంతరకర పోస్టులు చేసిన వాళ్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు పలువురి ఫిర్యాదుల మేరకు బన్నీ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి.
పుష్ప-2 సినిమా రిలీజ్‌కు ముందురోజు బెనిఫిట్‌షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన, ఆ తర్వాత సినిమా హీరో అల్లు అర్జున్ అంశాలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పుష్ప బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన చోటు చేసుకకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటికి పద్నాలుగు రోజులు గడిచినప్పటికీ ఇంకా బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. బాలుడు మృత్యువుతో పోరాడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు.. ఈ పరిణామానికి సంబంధించిన అంశంలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈనెల 13వ తేదీన అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే, అదేరోజు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ రావడంతో మరుసటిరోజు ఉదయం చంచల్‌గూడ జైలునుంచి విడుదలయ్యాడు. అయితే.. పోలీసులు మాత్రం అంతటితో ఆగడం లేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనను తెలంగాణ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. అసలు సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణమేంటి? ఈ పరిణామానికి ఎవరు బాధ్యులు? అనే అంశాలపై హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకోవైపు.. ఈ పరిణామాలపై రాజకీయాలు కూడా వేడెక్కాయి. సంధ్య థియేటర్ ఘటనలో వైఫల్యాలపై.. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్‌ను విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప.. మిగతా పార్టీలన్నీ అల్లు అర్జున్ అరెస్టును తప్పు పట్టాయి. ఈమేరకు పలువురు నాయకులు తమ ఒపీనియన్ మీడియాకు విడుదల చేశారు. ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. ఒకరకంగా సీఎం రేవంత్‌రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే అందరూ రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ ను కావాలనే అరెస్టు చేశారని.. కొంతమంది తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పైత్యం కొందరిలో ముదిరింది. విమర్శలు గతి తప్పాయి. వెకిలిగా, వెటకారంగా, అభ్యంతరకరంగా కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో, అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకరంగా, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై పలు సెక్షన్ల కింద ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు చేశారు.ఇంకా కేసులు పెడతామని అంటున్నారు. ఈ వ్యవహారంలో పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు నమోదు చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితులపై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. వీటిపైనా విచారణ కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.