ఫార్ములా ఈ రేసు కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది… ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.. గవర్నర్ కూడా కేటీఆర్ని విచారించేందుకు ఆమోదం తెలపడంతో ఎప్పుడు దీనిపై యాక్షన్ లోకి దిగుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. గత వారమే గవర్నర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే విషయంపై తెలంగాణలో అన్ని పక్షాలు ఎదురుచూస్తున్నాయి.. దీనికి తోడు ఈ కేసులో నన్ను అరెస్టు చేస్తారని పదేపదే స్వయంగా కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు.. ఆరు నెలలు జైల్లో ఉండడానికి నేను సిద్ధమవుతున్నట్టుగా ఆయన ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న మార్గాలు ఏంటి.. మొదటి మార్గం గవర్నర్ ఆమోదం తెలపడంతో వెంటనే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలవడం… రెండో మార్గం ఇప్పటికే ఈ కేసులో విచారణ జరగడం అదే సమయంలో అంతా తానే చేశానని స్వయంగా కేటీఆర్ అంగీకరించారు కనుక నేరుగా కేటీఆర్ ని అరెస్టు చేయవచ్చు అని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇక ఈ కేసు విషయానికొస్తే..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్‌లో భారీ స్కాం జరిగినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయని విచారణలో బయటపడింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపులు జరిగినట్లు తేలింది. గవర్నర్ ఆమోదం లేకుండా యాక్షన్ తీసుకోకూడదు అన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు న్యాయ సలహా తీసుకొని దీనిపై ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అరెస్టు చేయాలంటే స్పీకర్ అనుమతి తీసుకోవాలన్న వాదన కూడా ఉంది.. ఈ టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకునే యాక్షన్ తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.. మొత్తానికి వచ్చే వారంలో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఈ అంశానికి రిలేటెడ్ గా గడచిన నాలుగు రోజులుగా ఆసక్తిర వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చెయ్యడం కేటీఆర్ అరెస్ట్ కోసం నిర్వహించిన మాక్ డ్రిల్ లాంటిదని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ని 11వ ముద్దాయిగా చేర్చారు. సాధారణంగా ఇటువంటి కేసుల్లో గతంలో ఎన్నడూ సెలబ్రిటీలను అరెస్ట్ చేసిన సందర్భం ఎక్కడా లేదు. కానీ ఈ కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం.. తాము ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తామనే సందేశం పంపిందని… ఇక తరువాత అరెస్ట్ కేటీఆరే అని బాగా ప్రచారం అవుతోంది. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలకు తిగుతుందో చూడాలి.