గత పది సంవత్సరాలు డీఎస్సీ నోటిఫికేషన్ వేయకుండా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తము చేసిన టిఆర్ఎస్ పాలకులు ఇప్పుడు నీతులు చెపుతున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వేసి 11, వేల మంది ఉపాధ్యాయులను నియామకం చేశామన్నారు. బోనకల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. మరో 6 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని భరోసా ఇచ్చారు. 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని గుర్తు చేశారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉండి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థుల వసతులు డైట్ చార్జీల పెంపు గురించి పట్టించుకోని బిఆర్ఎస్ పాలకులు ఇప్పుడు హాస్టల్స్ బాగోలేవని, భోజనం సరిగా లేదని మాట్లాడటానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిన్నది మీ వల్లనే అన్న సోయి తప్పి బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
నెలల తరబడి గురుకుల పాఠశాలలో హాస్టల్స్ బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడం వల్ల నాసిరకం ఆహారం తినడం వల్లనే విద్యార్థులు ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డైట్ చార్జీలు పెంచితే పౌష్టికాహారం తినడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేవారు. ఆ పరిస్థితి లేకుండా చేసింది గత బిఆర్ఎస్ పాలకులే అన్నారు.
గురుకుల పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ కు గత బి ఆర్ ఎస్ పాలకులు నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టితే.. అధికారంలోకి రాగానే బిల్లులు చెల్లించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదన్నారు. తెలంగాణలో చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలన్నది ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని వెల్లడించారు.
నేటి బాలలే రేపటి పౌరులని తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వీరే అని భావించిన ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి 40% డైట్ చార్జీలు పెంచిందన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందించాలి. నాణ్యత లోపిస్తే ఉపేక్షించం కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో కల్తీ అనే మాటే ఉండకూడదు పరిశుభ్రతలో తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు.