కలెక్టర్లుకు సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
జిల్లాల్లో జల వనరుల సంరక్షణకు అధిక ప్రాధాన్యవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో జలవనరుల విభాగం ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఆయన స్పందిస్తూ జలవనరులను సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు. ఈ సారి మనం సమర్థవంతంగా జలవనరులను ఉపయోగించుకున్నామన్నారు. నీరు వృధా కాకుండా దాదాపుగా అన్ని రిజర్వాయర్లను నీళ్లతో నింపుకోగలిగామని చెప్పారు. కాలువల మరమ్మతులు పర్యవేక్షించాలన్నారు కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే రెండు సీజన్లలో కనీసం 8 మీటర్లలో భూగర్భ జలాలుండేలా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. నదుల అనునసంధానం క్లిష్టమైన లక్ష్యమని, దానికి రూ.లక్ష కోట్లు అవుతుందని, అయితే కేంద్రం సహకారంతో ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తామని తెలిపారు.
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం
పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. ఈసారి వరుణుడు కరుణించాడని, అన్ని జలాశయాలు నింపుకోగలిగామన్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ లు జరగడం వల్ల జిల్లాలో అనూహ్యంగా వర్షాలు కురిశాయన్నారు. బుడమేరు ఎగువ ప్రాంతంలో కూడా ఇలా జరగడం వల్లే వరదలు సంభవించాయని వివరించారు. భవిష్యత్తులో ఈ క్లౌడ్ బరస్ట్ లు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని, వాటిని ఎలా ఎదుర్కోవాలనేదానిపైన పనిచేస్తున్నామన్నారు. జిల్లాల్లో కలెక్టర్లంతా నరేగా పనుల్లో చెక్ డ్యామ్ ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచన చేశారు.