39.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

అన్నదమ్ములు ముగ్గురూ మంత్రులయ్యారు

చిరంజీవి తరతరాలుగా మర్చిపోలేని పేరు. గడచిన నాలుగున్నర దశాబ్ధాలుగా తెలుగు సినీ రంగాన్ని ఏలుతున్న చిరంజీవి కుటుంబానికి అతి త్వరలో ఒక ప్రత్యేకత సంతరించుకోనుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులుగా చేసిన ఘనత చిరంజీవి కుటుంబానికి దక్కబోతోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీని స్ధాపించి తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తెచ్చిన చిరంజీవి సంవత్సరం తిరగకుండానే కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రంలో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజన జరిగిన 2014వ సంవత్సరం వరకూ చిరంజీవి కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఆతరువాత పదేళ్లకు ఆయన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్ధాపించని పదేళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కించుకున్నారు. అయితే చిరంజీవి తిరుపతి నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఆ తరువాత తన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ ఇచ్చిన రాజ్యసభ పదవి తీసుకుని కేంద్ర మంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్ధాపించిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ తరువాత 2019లో తానుస్ధాపించిన జనసేన పార్టీ నుంచి 134 స్ధానాల్లో పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నారు. తాను పోటీ చేసిన రెండు స్ధానాల్లో సైతం ఓటమి చవిచూశారు. 2024లో వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే నినాదంతో బీజేపీని ఒప్పించి టీడీపీతో కలసి కూటమి కట్టి… పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే ఆయన్ను ఉపముఖ్యమంత్రి పదవి వరించింది.

ఇక చిరంజీవి సోదరుల్లో మధ్యముడైన నాగబాబు తన కాంట్రవర్సీ కామెంట్లతో రాజకీయ వర్గాల్లోనే కాక సినీ వర్గాల్లో కూడా అలజడి సృష్టించడంలో నేర్పరి. తాజాగా నాగబాబు కూడా చంద్రబాబు క్యాబినేట్ లో చేరనున్నారు. ఈ మేరకు చంద్రబాబు స్వయంగా సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యసభ సభ్యుల జాబితా విడుదల చేసిన సందర్భంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించామని చంద్రబాబు ప్రకటన చేశారు. ఇవావళో రేపో మంచి రోజు చూసుకుని నాగబాబుతో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేయిస్తారు. దీంతో మెగా బ్రదర్స్ గా పేరుపొందిన ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా పని చేసిన ఘనతను సాధించినట్లవుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్, నాగబాబులు ఒకే సమయంలో చంద్రబాబు క్యాబినేట్ లో మంత్రులు గా పనిచేసి అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి మంత్రులుగా పనిచేసిన రికార్డు సాధిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com