కర్ణాటక రాజకీయాల నుంచి, దేశ , విదేశీ రాజకీయాల్లో కూడా సోమన హళ్లి మల్లయ్య క్రిష్ణ (ఎస్ ఎం క్రిష్ణ )తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. విద్యార్ధి దశ నుంచే ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.అమెరికాలో చట్ట సభలకు కూడా ఆయన విశేష క్రుషి చేశారని చెప్పుకోవాలి.క్రిష్ణ అమెరికా లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో తనదైన పాత్ర పోషించారు. అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్ధి జాన్ ఎఫ్ కెనెడీ కి ప్రచారంలో ఎంతో సాయపడ్డారు. భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కెన్నెడికి తాను మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని క్రిష్ణ స్వయంగా ఆయనకు లేఖ రాశారు. ఆయన లేఖకు కెన్నెడీ స్పందించనప్పటికీ గెలిచిన తర్వాత క్రిష్ణ సేవలను ప్రశంసిస్తూ లేఖ రాశారు. వ్యక్తిగతంగా కలసి ధన్య వాదాలు తెలియ చేయనప్పటికీ , ఆయన సేవలను గుర్తించలేదని భావించవద్దని కెనెడీ తన లేఖలో రాశారు. అలాగే మన కేంద్రప్రభుత్వ విదేశాంగ మంత్రిగా కూడా క్రిష్ణ పనిచేశారు. ఎన్నో కీలక నిర్ణయాలకు ప్రాణం పోశారు.
బెంగళూరు ఐటీ సిటీ ఆయన చలవే..
ఇక కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర తలరాతను మార్చే నిర్ణయాలెన్నింటికో ఆయన ఆద్యుడు. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని ప్రపంచ పటంపై నిలబెట్టిన అతి కొద్దిమంది నేతల్లో ఆయన ఒకరు. బెంగళూరులో ఐటీ సెక్టర్ ఎదుగుదలకు ఆద్యుడు ఆయనే. ఈరోజు బెంగళూరును ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పిలుస్తున్నారంటే అది క్రిష్ణ చలవే.
కాంగ్రెస్ తో 50 ఏళ్ల అనుబంధం..
ప్రస్తుతం ఆయన బీజేపి నేతగా ఉన్నా తన సుదీర్ఘ రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ సేవలోనే గడిపారు.కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్ల ట్రాక్ రికార్డ్ ఆయనది. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్లమెంటు ఉభయ సభలకు ఎంపీగా దీర్ఘకాలం కొనసాగిన చరిత్ర కూడా ఆయన సొంతం.
1999లో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడుగా పార్టీని గెలుపు పథంలో పయనింప చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు ప్రజా సోషలిస్టు పార్టీలో ఉండేవారు.
లా గ్రాడ్యుయేట్ అయిన ఎస్ఎం క్రిష్ణ డల్లాస్, టెక్సాస్, వాషింగ్టన్ యూనివర్సిటీలలో చదువుకున్నారు. ఆయన ఫుల్ బ్రైట్ స్కాలర్ కూడా. నష్టాల ఊబిలో కూరుకుపోయిన కేఫ్ కాఫీ డే సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించిన మాళవికా హెగ్డే ఎస్ ఎం క్రిష్ణ కుమార్తె కావడం విశేషం..