ప్రజల ఆశీర్వచనాలే ప్రభుత్వానికి ఆక్సిజన్ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతీ యువకుల జీవితాల్లో వెలుగులు చూడటమే యువ వికాసం అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులను గాలికి వదిలేస్తే… వారు నడుం బిగించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని అన్నారు.
56 వేల మంది యువతకు 11 నెలల్లో నియామక పత్రాలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వానిది అన్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1500 కోట్లతో పెద్దపల్లి సాక్షిగా శంకుస్థాపనలు చేశామన్నారు.
స్మశాన వాటికలు, గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తే ఎన్నో పనులు చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులను తామే చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.
ప్రజల కోసం ఏమీ చేయటం లేనది బీఆర్ ఎస్ బెదిరిస్తోందని… మేము అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకే అని స్పష్టం చేశారు. మంత్రి మండలి మొత్తం భవిష్యత్ తరాల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. ప్రచారం కోసం తాపత్రయ పడటం లేదన్నారు.
పదేళ్లలో చేసిన అప్పుల్లో 64వేల కోట్లు బ్యాంకులకు వడ్డీలు, అప్పులు కట్టామన్నారు. పండిన ప్రతిగింజను కొనుగోలు చేస్తూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు.
సింగరేణి విద్యుత్ ప్రాజెక్టులతో పాటు జైపార్ స్టేజ్ 2 తోపాటు మరో థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. గత పదేళ్లలో రామగుండం సింగరేణి, జెన్ కోతో కలిపి థర్మల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేయబోతున్నామన్నారు.
ఉత్తర తెలంగాణ ప్రజలకు ఒకటే తెలియచేస్తున్నాం… రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్ల కోసం, ఉద్యోగాల కోసం, ఆత్మగౌరవంతో జీవించేందుకు అన్నారు. గత పదేళ్లలో నీళ్లు తీసుకురాలేదని, మేడిగడ్డ మునిగిపోయింది..లక్ష 20 వేల కోట్ల రూపాయలు నీటి పాలు చేశారని విమర్శించారు. కాళేశ్వరం నుంచి ఈ ఏడాది చుక్కనీరు రాకపోయినా రాష్ట్రంలో అధిక దిగుబడి సాధించామన్నారు.
కాంగ్రెస్ పాలనలో నిర్మించిన కడెం, కాకతీయ కాలువ, సరస్వతి కాలువ తదితర కాంగ్రెస్ హయంలో చేపట్టిన ప్రాజెక్టులే రైతాంగానికి మేలు చేశాయన్నారు.
మేము ప్రచారం చేసుకోవడం లేదు. కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రూపాయి రూపాయి పోగు చేసి ప్రజల కోసమే ఖర్చు చేస్తామని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.