కొణిజేటి రోశయ్య.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న అరుదైన నాయకుడు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన శాఖలన్నింటికీ మంత్రిగా పనిచేసిన రోశయ్య.. చివరి అంకంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వాగ్ధాటిని విపక్ష నేతలు సైతం మెచ్చుకునేవాళ్లంటే అతిశయోక్తి కాదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనకంటూ ప్రత్యే ఇమేజ్ సంపాదించుకున్నారు. గొప్ప హాస్య చతురతతో పాటు ముక్కుసూటిగా వ్యవహరించేవారు. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా అపారమైన పట్టు, అవగాహన రోశయ్యకు ఉండేవి. అదంత సామాన్యమైన విషయం కాదు. వివాదాలకు దూరంగా ఉండేవారు. రాజనీతిలో అపర చాణక్యుడుగా పేరు సంపాదించారు రోశయ్య. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన చిరునామాగా నిలిచారు. మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించారు. అసెంబ్లీలోగానీ, బయటగానీ తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎవరైనా సరే.. ఎదుటివాళ్లను ఏమాత్రం నొప్పించకుండా ప్రసంగించడం ఆయన గొప్పదనం. ఏమాత్రం మాట తూలకుండా ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టేవారు రోశయ్య.
ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్‌జీ రంగా శిష్యులు కొణిజేటి రోశయ్య. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో పాటు రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్‌పార్టీ తరఫున కొణిజేటి రోశయ్య.. 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికై సేవలందించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వర్తించారు. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖల బాధ్యతలు చేపట్టారు. 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. చివరి ఏడు సార్లు వరుసగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఓ రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోశయ్యదే. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరు పొందారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా వినుతికెక్కారు. ఇంత సీనియర్ నాయకుడైనప్పటికీ, కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పటికీ రోశయ్య గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. అయినా కేబినెట్‌లో కీలక శాఖలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అధిష్టానం, ప్రభుత్వం తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడిగా పేరొందారు.
ప్రభుత్వంలో అమాత్యులుగా సేవలందించడమే కాదు.. 1995–97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ – పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య.. 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా నియామకమయ్యారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నర్‌గా సేవలందించారు.
రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆరోగ్యం సహకరించినప్పుడల్లా సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథిగా హాజరయ్యేవారు రోశయ్య. అనారోగ్యంతో బాధపడుతూ 2021 డిసెంబర్ 4న హైదరాబాద్‌లో రోశయ్య కన్నుమూశారు.