గడిచిన పదేళ్లలో దేశంలో నక్సలిజం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్’ అమలుతో మావోయిస్టుల దళాల రిక్రూట్మెంట్, సమాచారం, రవాణా, వనరులపై కేంద్ర బలగాలు తీవ్రంగా దాడులు చేపట్టాయని పేర్కొంది. నక్సల్స్ హింస 81 శాతం, హత్యలు 85 శాతం తగ్గాయని తెలిపింది.
2014లో 126 జిల్లాలు, ఇప్పుడు కేవలం 6 :
2014లో దేశంలో 126 జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఉండగా.. 2024 నాటికి ఇది 12 జిల్లాలకి తగ్గిందని కేంద్రం నివేదికలో వెల్లడించింది. వాటిలో కూడా కేవలం 6 జిల్లాల్లో మాత్రమే తీవ్రంగా ప్రభావం ఉందట. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుకుమా, ఝార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఫలితం :
దశాబ్దం క్రితం 18,000 చ.కి.మీ.గా ఉన్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఇప్పుడు 4,200 చ.కి.మీ.కి పరిమితమయ్యింది. గత 10 ఏళ్లలో 8 వేల మంది మావోయిస్టులు హింస మార్గాన్ని వీడి జన జీవన స్రవంతిలో కలిశారు. 612 పోలీస్ స్టేషన్లు, 14,618 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, 7,768 4జీ టవర్లు, 1,007 బ్యాంకులు, 178 ఏకలవ్య పాఠశాలలు, 61 నైపుణ్య కేంద్రాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మించినట్లు కేంద్రం పేర్కొంది.
కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్ – 31 మంది మావోయిస్టులు హతం :
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఇటీవల చేపట్టిన “ఆపరేషన్ కగార్”లో 16మంది మహిళలు సహా 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేశాయి. అదే సమయంలో మావోయిస్టుల రవాణా, సమాచార వ్యవస్థలను దెబ్బతీశాయి.