ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది
వైఎస్సార్సీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్ధతకు లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న వంశీకి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో జైలు అధికారులు ఆయన్ని హుటాహుటీన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం శ్వాస తీసుకోవడంతో బాగా ఇబ్బంది కలగడంతో ఆయన ఈ విషయాన్ని జైలు అధికారులకు తెలియజేశారు. పరిస్ధితి గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆయన్ను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ జైలులో అస్వస్ధతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారని వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులకు తెలియడంతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున ఆసుపత్రికి చేరుకుని వంశీ ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీకి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు ఈ కేసులో ఉన్న మరో నలుగురు వ్యక్తులకు కూడా బెయిల్ లభించింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఇంకా బెయిల్ లభించకపోవడంతో ఆయన జైలులోనే రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి వంశీ ఆరోగ్యంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.