- సింధూరం తుడిచినందుకే గుండెలపై తన్నాం
- మహిళల సిందూరం తుడిస్తే ఏంజరుగుతుందో చూపాం
- పీవోకే సంగతి తేలాకే కశ్మీర్ పై చర్చలు
- అణు బ్లాక్ మెయిల్ చేస్తే సహించం
- రక్తం, నీరు కలసి ప్రవహించలేవు
- ఆపరేషన్ సిందూర్ సిద్ధాంతపరమైన మార్పుకు పునాది
- ఉగ్రవాద వ్యతిరేక పాలసీకి నాంది
- అత్యంత పకడ్బందీ ఆపరేషన్ కు త్రివిధ దళాలకు సెల్యూట్
- అమాయక పౌరులను మతం అడిగి చంపడం దారుణం
- ఆపరేషన్ సిందూర్ తర్వాత మోడీ జాతినుద్దేశించి ప్రసంగం
ఉ గ్రవాద శిబిరాలను నేల మట్టం చేసిన ఆపరేషన్ సిందూర్ కేవలం ప్రతిచర్య మాత్రమే కాదని సిద్ధాంతపరమైన మార్పుకు నాంది పలికిందని,ఉగ్రవాద వ్యతిరేక పాలసీకి పునాది పడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఎంతో భావోద్వేగంతో స్పందించారు.మహిళల సిందూరం తుడిచేస్తే ఏం జరుగుతుందో ఉగ్రమూకలకు చూపించామని అన్నారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.పీఓకే, పాకిస్థాన్లలో 9 ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసిన తర్వాత దేశ ప్రజల ముందుకు మోడీ రావడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సిందూర్ అయిపోలేదని భారత పౌరులపై ప్రభుత్వ ప్రేరిత ఉగ్ర దాడులు జరిపితే ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా మన త్రివిధ దళాధిపతులు చెబుతున్న మాటలను మోడీ పునరుద్ఘాటించారు. భారత్ పై అణు బ్లాక్ మెయిల్ పనిచేయదని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ ఆయుధాలన్నీ స్ట్రాల మాదిరి పడిపోయాయని అన్నారు. భవిష్యత్తులో పాకిస్థాన్ తో చర్చలంటూ జరిగితే అవి పీఓకే పైనా, ఉగ్రవాదం పైనా మాత్రమేనని స్పష్టం చేశారు. మన సైన్యం దెబ్బకు పాకిస్థాన్ ప్రపంచ దేశాలను శాంతి చర్చలకు భారత్ ను ఒప్పించమని దేబిరించిందని మోడీ అన్నారు. మన త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ నిచ్చామని మన బలగాలకు,పారామిలటరీ ఏజెన్సీలకు, ఇంటెలిజెన్స్ సంస్థలకు సాల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఆపరేషన్ సిందూర్ కేవలం పేరు మాత్రమే కాదని,ప్రజల సెంటిమెంట్ కు ప్రతిబింబమనీ మోడీ తెలిపారు.
నా మనసు తీవ్రంగా గాయపడింది..
ఏప్రిల్ 22న అమాయక పౌరులను మతం అడిగి మరీ భార్యలముందే, పిల్లలముందే క్రూరంగా కాల్చి చంపారని ఈ చర్య తనను వ్యక్తిగతంగా చాలా బాధించిందని అన్నారు.ఘోరమైన ఈదాడికి ప్రతిచర్య తప్పనిసరి అని దేశవ్యాప్తంగా అందరూ నినదించారని గుర్తు చేశారు. ఉగ్రచర్యకు మన ప్రతిచర్య ఇంత భయంకరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నరు. మన క్షిపణులు, డ్రోన్లు ఉగ్రవాదులను నిలువెల్లా వణికించాయన్నారు. బహావల్ పూర్, ముర్డిక్ ప్రపంచ ఉగ్ర యూనివర్సిటీలని ప్రధాని అన్నారు. ఆ వర్సిటీలను నేలకూల్చామని 100 మంది ఉగ్రవాదులను హతం చేశామని మోడీ అన్నారు. సాధారణ పౌరులకు దెబ్బ తగలకుండా కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులు చేసి నేలమట్టం చేయడం మన సైనికుల ప్రతిభకు నిదర్శనమన్నారు. మనదెబ్బ ఇంత దారుణంగా, ఇంత గట్టిగా ఉంటుందని పాకిస్థాన్ ఊహించలేదని ప్రపంచ దేశాలకు శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించమని దేబిరించుకుందని ప్రధాని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ అయిపోలేదని, పాక్ ప్రతిచర్యను బట్టి తమ తదుపరి చర్యలుంటాయని అన్నారు.పాకిస్థాన్ వికృత ఉగ్రరూపాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. పాకిస్థానీ ఆర్మీ అధికారులు టెర్రరిస్టుల అంత్యక్రియలకు హాజరవడం సిగ్గుచేటైన విషయమన్నారు.21వ శతాబ్దంలో యావత్ ప్రపంచం మేడిన్ ఇండియా ఆయుధాలు ఎంత శక్తిమంతంగా ఉన్నాయో చూసిందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అంతం పలకాల్సిందేనని లేదంటే ప్రపంచ పటంపై దాడి ఉనికి ఉండబోదని మోడీ తేల్చి చెప్పారు. అవసరమైనప్పుడు బలం ప్రయోగించాల్సిన అవసరముందని ప్రధాని అన్నారు.