ఎండలు మండిపోతున్న ఈ సమయంలో వాతావరణ శాఖ మంచి వార్త చెప్పింది. ఈ సంవత్సరం అనుకున్న సమయం కంటే ముందే రుతుపవనాలు రానున్నాయని ఐఎండి వెల్లడించింది. తీవ్రమైన ఉక్కపోతతో అలమటించిపోతున్న ప్రజలకు ఇది శుభవార్తే. వాస్తవానికి ప్రతియేటా జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వస్తాయి. అయితే ఈ సంవత్సరం మే నెల 30వ తేదీ నాటికే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తాజాగా వాతావరణ శాఖ వేసిన ఈ అంచనాను కూడా సవరించుకుని మే30వ తేదీ కంటే నాలుగు రోజుల ముందే రుతుపవనాలు వస్తాయని చెపుతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వేసిన అంచనాల కంటే నాలుగు రోజులు ముందుగానే రానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మే15వ తేదీ తరువాత అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అనుకూల వాతావరణం చూస్తే రానున్న రెండు రోజుల్లోనే వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. రేపు లేదా ఎల్లుడి రుతుపవనాలు అండనామాన్ ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా రుతుపవనాలు కేరళను తాకుతాయంటున్నారు. ఈఏడాది వర్షాలు కూడా విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. ప్రతి ఏటా కేరళలో రుతుపవనాల రాగానే భారతదేశంలో వర్షాకాలం వచ్చినట్లుగా పరిగణిస్తారు. 2020 సంవత్సరంలో భారతదేశంలో జూన్ 1న, 2021 సంవత్సరంలో జూన్ 3న, 2022 సంవత్సరంలో మే 29న, 2023 సంవత్సరంలో జూన్ 8న, 2024 సంవత్సరంలో మే 30న రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం వారం రోజులు ముందుగానే వస్తున్నట్టు లెక్కలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ విపరీతంగా వీస్తోంది. సాయంత్రం నాలుగు తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.