తెలంగాణ ఎమ్మెల్యే గెడ్డం వివేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ఎక్కువ సంఖ్యలో ఉన్న మాల కులం తమ క్కుల కోసం ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్రంలోని చెన్నూరు శాసనసభ్యుడు గెడ్డంవివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మాలలు అంత మంది ఉన్నారా…? వారికి ప్రభుత్వాలను ప్రభావితం చేసే శక్తి ఉందా అని చాలా మంది అనుకుంటున్నారని వారికి మన సత్తా ఏంటో చూపించాలంటే మాలలంతా ఏకతాటిపైకి రావాలని వివేక్ సూచించారు. తిరుపతిలో జరిగిన మాలల ఆత్మీయ సభకు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సమావేశాలకు పెద్ద సంఖ్యలో మాలలు హాజరై ప్రభుత్వాలకు బలమైన సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో అధికంగా ఉన్న మాలలకు నాయకత్వ బాధ్యత ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాలల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొట్లాడుతుంటే తనను సస్పెండ్ చేయమని చాలా మంది డిమాండ్ చేశారని, కానీ మాల జాతి కోసం బయటకు వస్తానని బయలుదేరానన్నారు. మాల జాతి కోసం కొట్లాడేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్దంమని వివేక్ ప్రకటించారు. మాలలు అనేక అసోసియేషన్లు పెట్టుకుని ఎవరికి వారే అన్నట్లుగా ఉంటారని అలా కాకుండా ఐక్యంగా పోరాటాలు చెయ్యడానికి అందరూ ఒక్కతాటిపైకి రావాలని వివేక్ పిలుపునిచ్చారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి హైదరాబాద్ లో మాలల సింహగర్జన సభ పెట్టామని గుర్తు చేశారు. ఎస్సీఎస్టీలకు 30 శాతం నిధులు ఖర్చు చేస్తామని అన్ని ప్రభుత్వాలు చెపుతాయని కానీ వాస్తవంలోకి వస్తే అంత ఖర్చు చేయరని ఈవిషయంపై దళితులు ఎవరూ నోరు విప్పడం లేదని అన్నారు. ఇప్పుడు మనం చేసే పోరాటాలను మన భవిష్యత్ తరాల తలరాతను నిర్ణయిస్తాయని తెలంగాణ శాసన సభ్యుడు గెడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.