పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు అనేక దేశాలు మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ చేపట్టిన ఈ ప్రతీకార దాడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సమయంలో టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు మాత్రం పాకిస్తాన్‌కు మద్దతు తెలిపాయి. భారత్ చర్యలను ఖండిస్తూ, పాకిస్తాన్‌కు బాసటగా నిలవడం అనేక దేశాల్లో విస్తృత చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ట్రావెల్ రంగంలో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. పాకిస్తాన్‌కు మద్దతు తెలిపిన టర్కీ, అజర్‌బైజాన్ దేశాలపై వివిధ ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ రెండు దేశాలకు కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా.. ఆ దేశాలకు ప్రయాణించబోయే వారు పునరాలోచించాలని కూడా సూచిస్తున్నాయి. టూరిజం రంగంలో ప్రసిద్ధి గాంచిన కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ టర్కీ, అజర్ బైజాన్, ఉజ్బెకిస్తాన్‌లకు బుకింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
ఇక మరో ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ ఈజ్ మై ట్రిప్ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. పహల్గామ్ దాడి నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, అత్యవసర పరిస్థితుల్లో తప్ప టర్కీ, అజర్‌బైజాన్‌లకు వెళ్లవద్దని సూచించింది. ఈ సంస్థ ఫౌండర్ నిషాంత్ కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు. ట్రావోమింట్ అనే మరో సంస్థ టర్కీ, అజర్‌బైజాన్ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ బుకింగ్‌లను రద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు విధించబోమని సంస్థ స్పష్టం చేసింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ ఫ్లైట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
ఇక ఈ పరిణామాల మధ్య భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లోనూ ట్రావెల్ బుకింగ్‌లపై ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హోటల్ బుకింగ్‌లు గణనీయంగా తగ్గినట్టు హోటల్ రంగ ప్రతినిధులు వెల్లడించారు. పర్యాటకులు భద్రత కారణంగా పర్యటనల విషయంలో వెనుకడుగు వేస్తుండటంతో ఈ ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ట్రావెల్ రంగంపైనే కాకుండా వ్యాపార సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. టర్కీ, అజర్‌బైజాన్‌లకు వ్యతిరేకంగా ట్రావెల్ సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.