భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులకు యత్నించగా, భారత దళాలు వాటిని సమర్థంగా తిప్పికొట్టాయి. అయితే ఈ పరిణామాలు మరింత ఉత్కంఠకు దారి తీస్తాయన్న ఆందోళనతో మార్కెట్లో తీవ్ర అస్థిరత చోటుచేసుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ సూచీలను నష్టాల్లోకి నెట్టేశాయి. వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 880 పాయింట్లు నష్టపోయి మళ్లీ 80 వేల దిగువకు చేరగా, నిఫ్టీ 24 వేల మార్క్‌కి కాస్త ఎగువన ముగిసింది. ముఖ్యంగా విమానయానం, టూరిజం, రియాల్టీ రంగాల షేర్లలో తీవ్రంగా అమ్మకాలు జరిగాయి. మరోవైపు, దేశ భద్రతపై ఆశలు పెరిగిన వేళ డిఫెన్స్ రంగానికి చెందిన స్టాక్స్‌పై కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. డ్రోన్ల తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్ షేరు ధర ఏకంగా 18 శాతం పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ స్థిరంగా ఉండగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.61 శాతం నష్టపోయింది. మార్కెట్లో అస్థిరత స్థాయిని సూచించే ఇండియా విక్స్ సూచీ 2.98 శాతం పెరిగి 21.63కి చేరింది. ఇంట్రాడేలో ఇది 8 శాతం వరకూ పెరిగింది.
సెన్సెక్స్ ఉదయం 78,968.34 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై ఇంట్రాడేలో అదే స్థాయిని కనిష్ఠంగా నమోదు చేసింది. చివరికి 880.34 పాయింట్ల నష్టంతో 79,454.47 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 265 పాయింట్లు నష్టపోయి 24,008.00 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి డాలరుతో 85.41 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 సూచీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగియగా, టైటాన్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 63 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్స్ ధర 3,329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.