ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్ గా మార్చేందుకు ప్రభుత్వం బాటలు వేస్తోందని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గృహోపకరణాల తయారీలో అంతర్జాతీయ స్ధాయి కలగిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న నూతన యూనిట్ కి నారాలోకేష్ గురువారం భూమి పూజ చేశారు. ఈసందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ రోజు కేవలం ఎల్‌జీ యూనిట్ కి భూమి పూజ మాత్రమే చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాది వేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. సుమారు ఐదు వేల కోట్ల పెట్టుబడితో ఎల్‌జీ సంస్ధ ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తోందని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని ప్రతిఫలిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సులభతరమైన వ్యాపారినికి హామీ ఇవ్వడమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఎల్జి యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నారాలోకేష్ హామీ ఇచ్చారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతోపాటు ఎల్జి సిటీ నిర్మించమని కంపెనీ యాజమాన్యాన్ని మంత్రి లోకేష్ ఆహ్వానించారు. రాబోయే నాలుగేళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం తో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ అత్యాధునిక తయారీ కర్మాగారానికి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మీ ముందుకు రావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్ తో పాటుగా ఎల్‌జీ కంపెనీ ఉద్యోగులు, దాని భాగస్వామ్య వ్యాపారులందరికీ హృదయపూర్వకంగా రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి నారా లోకేష్ స్వాగతం పలికారు.
- Advertisement with us -