భారత్ , పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలేమాన్ యాంగ్ స్పందించారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతల నివారణకు చర్చలు జరపాలని సూచించారు. పౌరులపైన, మౌలికసదుపాయాలపైన ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెగేసి చెప్పారు.
చర్చలు, దౌత్య మార్గం ద్వారానే శాంతి సాధ్యం అవుతుందన్నారు. దీర్ఘకాలిక శాంతికి రెండు దేశాలు కృషి చేయాలని యాంగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సేనలు మెరుపు దాడులు చేశాయి. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
బుధవారం తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 1.30 మధ్య భారత సేనలు సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కోఆర్డినేషన్‌తో ఈ దాడులు చేశాయి. దీంతో పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ క్రమంలో యూఎన్‌జీఏ అధ్యక్షుడు యాంగ్ నిగ్రహం పాటించాలంటూ సలహా ఇచ్చారు.