భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొప్పురాయి రెవెన్యూ గ్రామం ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతం. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని అనేక ఏజెన్సీ గ్రామాల్లాగే కొప్పురాయి ప్రాంతం కూడా నేతల దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తున్నది. ఎన్నికలప్పుడు తప్ప అధికారులు, నాయకులు దృష్టి పెట్టని ఆదివాసి ప్రాంతాల్లో ఒకటి. ఈ ప్రాంతంలోకి ఎనభయ్యో దశకంలో ఆంధ్రకు చెందిన గుంటూరు ప్రాంతం నుండి అగ్ర వర్ణానికి చెందిన వారు వలస వచ్చారు. అమాయక ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వందల ఎకరాల రెవెన్యూ భూములను వారి కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అడిగేవారు లేకపోవడంతో మరొ అగ్ర వర్ణానికి చెందిన కుటుంబాలను కూడా కొప్పురాయి ఏజెన్సీ ప్రాంతానికి ఆహ్వానించి ఇప్పటి వరకూ సుమారు నాలుగు వందల ఎకరాల వ్యవసాయ భూములను గిరిజన చట్టాలను ఉల్లంఘించి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.
తరతరాలుగా ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన ఆదివాసీలకు పట్టుమని ఐదెకరాలకు కూడా పట్టాలు లేకుండా జీవిస్తుండగా ఎనభయ్యో దశకంలో వలస వచ్చిన రెండు అగ్ర వర్ణ కుటుంబాలకు వారితో పాటు వచ్చిన వారి బంధువర్గాలకు ఒక్కొక్కళ్ళకు ఇరవై ఎకరాలకు పట్టాలు కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెవెన్యూ అధికారుల సహాయంతో ఆదివాసీ చట్టాలకు తూట్లు పొడిచి పట్టాలు పొందడమే కాకుండా అక్కడే పుట్టిపెరిగిన గిరిజనులు అడవికి వెళ్లే దారులను సైతం మూసి ఆదివాసీలపై దౌర్జన్యానికి దిగుతున్నారు. మామిడి, జామాయిల్ సాగు చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. వారి స్వాధీనంలో ఉన్న భూములలో నుండి ఆదివాసీలు నడవడానికి కూడా అనుమతించని అరాచక భూస్వామ్య వ్యవస్థ కొప్పురాయి రెవెన్యూ ప్రాంతంలో వెళ్ళూనుకుంది. గిరిజనులకు చెందవలసిన వందల ఎకరాలను ఆక్రమించుకుంటూ వారిపైనే దౌర్జన్యాలకు దిగుతున్న గిరిజనేతరులపై ఆదివాసులు కన్నెర్ర చేశారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలని పదకొండు కుటుంబాలపై ఫిర్యాదు చేయడంతో అందరికీ నోటీసులు వచ్చాయి. దీంతో బెంబేలెత్తిన గిరిజనేతరులు రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ అన్యాయపు రాజీ ప్రయత్నంలో గిరిజన ప్రజా ప్రతినిధులు, ఆదివాసి కుల పెద్దలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
రాజీ పడాలని ఒత్తిడి
ఈ కేసును వాపస్ తీసుకోకపోతే గ్రామంలో కొంతమంది అధికార పార్టీకి చెందిన మా గిరిజనులను మా పైకి ఉసిగొల్పి గ్రామ బహిష్కరణ చేస్తామని అంటున్నారని కన్నీరు మున్నీరు అయ్యారు. భారత రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను రక్షించాల్సిన అధికార పార్టీ నాయకులే ఈ గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ ఎల్టీఆర్ కేసు పెట్టిన గిరిజనులను భయపెడుతూ వందలాది ఎకరాలు ఆక్రమించుకున్న గిరిజనేతరులకు గిరిజననాయకులే వత్తాసు పలకటం తగదన్నారు. ఇది జాతి ద్రోహం అని, తల్లీ పాలు తాగి రొమ్ము గుద్దడం అంటే ఇదే అన్నారు. గిరిజన చట్టాలపై పోరాటం చేస్తున్న మాకు వీరి వల్ల ప్రాణహాని ఉందని తెలిసి కూడా పోరాడుతున్నామన్నారు. ఇది కేవలం భూపోరాటమే కాదని గిరిజనుల ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమని ఇందులో తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. గిరిజన సంఘాలు, మేధావులు మీడియా గిరిజనులకు అండగా ఉండాలని కోరారు.