జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడి మరోసారి భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను రగిలించింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాద సంస్థల పాత్ర ఉందని భారత గూఢచార సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడి జరిగిన వెంటనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ తామే ఈ ఉగ్ర దాడికి బాధ్యులమని ప్రకటించినప్పటికీ.. తర్వాత ఆ ప్రకటనను వెనక్కు తీసుకుంది. మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది.
పాకిస్తాన్ ఈ పరిస్థితిని యుద్ధానికి దారి తీసేలా మార్చకూడదన్న ఉద్దేశ్యంతో ముస్లిం దేశాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌తో మాట్లాడి మధ్యవర్తిత్వాన్ని కోరారు. గల్ఫ్ దేశాలతో సమావేశాలు జరిపిన షరీఫ్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ రాయబారులకు దక్షిణాసియాలో శాంతి కోసం తమ కట్టుబాటును వివరించారు. చైనా, రష్యాలను కూడా పాకిస్తాన్ సంప్రదించి, భారత్ దాడిని అడ్డుకునేలా ప్రాధేయపడ్డారు. అంతేకాక, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అదనపు భద్రత కల్పించడంతో పాటు సరిహద్దుల్లో ఆహార నిల్వలు పెంచడం వంటి రక్షణాత్మక చర్యలు చేపట్టారు.
అయితే అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు భారత్‌కు తమ మద్దతును స్పష్టంగా ప్రకటించాయి. అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడుతూ భారత్‌కి స్వీయ రక్షణ హక్కు ఉందని స్పష్టం చేశారు. మరోవైపు, చైనా, టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ పక్షాన నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఇటీవల ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తోంది.
పహల్గాం దాడి అనంతరం భారత్ తీసుకుంటున్న దౌత్య, సైనిక చర్యలు తీవ్రస్థాయిలో ఉండగా, వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ పౌరులకు వీసా రద్దు, సింధు నదీ ఒప్పందం రద్దు వంటి నిర్ణయాలు పాక్‌ను దోషిగా మార్చి ఒంటరిగా నిలబెట్టాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను ఒంటరిగా నిలబడేలా చేస్తూ, భారత్ మద్దతు పొందడంలో విజయవంతమవుతోంది. అంతేకాదు.. 2016 ఉరి, 2019 పుల్వామా దాడులకు ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్‌లు, ఎయిర్ స్ట్రైక్‌లను తలపిస్తూ.. ప్రస్తుత పరిస్థితులు గంభీరంగా మారిపోయాయి. అయితే, రెండూ అణ్వాయుధ దేశాలే కావడంతో.. భారత్–పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం కాకుండా, నియంత్రిత ప్రతీకార చర్యలే కొనసాగుతాయనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ సైన్యం దేశంలో అంతర్గత రాజకీయ సంక్షోభం నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ పరిస్థితిని వాడుకుంటుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ ఉద్రిక్తతల నడుమ అంతర్జాతీయ సమాజం శాంతియుత పరిష్కారాన్ని కోరుతోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికా, గల్ఫ్ దేశాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమవుతున్నాయంటున్నారు.