-
ఆధారాలు సంపాదించిన భారత నిఘా విభాగం
-
శాటిలైట్ ఫోటోల్లో స్పష్టంగా ఉగ్ర శిబిరం
-
ఈ ఉగ్రవాద క్యాంప్‌కు రక్షణగా పాక్ సైనికుల సెక్యూరిటీ
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ – పీఓకేలో లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద శిక్షణా శిబిరం ఆనవాళ్లు దొరికాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే నిర్వహిస్తోన్న ఆ ట్రైనింగ్ సెంటర్ ఉనికిని వెల్లడిస్తున్న శాటిలైట్ ఫొటోలు భారత నిఘా చేతికి అందాయి. ఏప్రిల్ 22వ తేదీన 26 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో లష్కరే తోయిబా పాత్రపై మొదటి నుంచీ అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు.. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్ మొదట ఈ దాడి తమ పనే అని ప్రకటన విడుదల చేసింది. తర్వాత తమకు సంబంధం లేదని మాట మార్చింది.
ఇక, ‘జంగల్ మంగళ్ క్యాంప్’ అని పిలువబడే ఈ ట్రైనింగ్ సెంటర్ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మన్సెహ్రా జిల్లాలోని అటార్ సిసా అనే పట్టణంలో ఉంది. నిఘా వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ ఉగ్రవాద శిక్షణా శిబిరం చాలా కాలంగా లష్కరే తోయిబా ఉగ్రవాదులకు కీలక శిక్షణా కేంద్రంగా పనిచేస్తోందట. ఈ ట్రైనింగ్ క్యాంప్‌లో నివాస ప్రాంతం, మసీదు, గెస్ట్ మీటింగ్ హాల్స్, విదేశీ ఉగ్రవాదుల కోసం ట్రైనింగ్ స్టేడియం వంటి నిర్మాణాలున్నాయి. ఇండియన్ ఇంటలిజెన్స్ చేతికి చిక్కిన శాటిలైట్ ఫొటోలో ఈ ట్రైనింగ్ క్యాంప్‌కు సమీపంలో ఒక సైనిక భవనం కూడా కనిపిస్తోంది. అంటే ఆ ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంప్‌కు పాకిస్తాన్ సైన్యం సెక్యూరిటీగా ఉన్న విషయం కూడా అర్థమైపోతోంది. ఈ క్యాంప్‌లో ఒక పెద్ద గ్రౌండ్‌లో ఆయుధాల ట్రైనింగ్, ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌ల కోసం ఉపయోగిస్తున్నారని భారత అధికారులు భావిస్తున్నారు.
ఈ టెర్రరిస్ట్ క్యాంప్‌పై భారత భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు నిరంతరం నిఘా ఉంచాయి. ఈ క్యాంప్‌ను భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పంపేందుకు ఏర్పాటు చేసినట్లు భారత నిఘా విభాగం అనుమానిస్తోంది. లష్కరే తోయిబా కమాండర్లు, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు తరచుగా ఈ క్యాంప్ కాంప్లెక్స్‌లోని ఫాగ్లా బీఆర్ ప్రదేశంలో జరుగుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్‌లకు హాజరవుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఫొటోలు బయటికి రావడంతో భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ ఫొటోలు బయటకు రావడంతో పీఓకేపై భారత్ నిఘాను మరింత ముమ్మరం చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న సపోర్ట్‌ను గుర్తించి, పాక్‌కు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిస్తోంది.