36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

కిలో మామిడిపండ్లు మూడు లక్షలు

కిలో మామిడి పండ్ల రేటు ఎంత ఉంటుంది..? రూ.200 లేదా రూ.300 రూపాయలు ఉంటుంది. కానీ ఒక కిలో మామిడి పండ్ల ధర అక్షరాలా మూడు లక్షల రూపాయలు పలుకుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అంత పెద్ద మొత్తంలో ధర పలకడానికి ఆ పండ్ల ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే.

ఆ అరుదైన మామిడి పండ్లనే ‘మియాజాకీ’ అంటారు. వాటికున్న డిమాండ్‌ను బట్టి ధర ఒక్కోసారి కిలో మూడు లక్షల రూపాయల వరకు పలుకుతుంది. ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్న ఖమ్మంకి చెందిన గోధూరి నాగేశ్వరరావు అనే రైతు కరోనా లాక్‌డౌన్ సమయంలో సాగు ప్రారంభించారు. ఇంత డిమాండ్ ఉన్న మామిడిని మన నేలపై పండిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి వెంటనే రంగంలోకి దిగారు. మధ్యవర్తుల ద్వారా కాలిఫోర్నియా నుండి ఒక్కో మొక్కను అక్షరాలా 12 వేల రూపాయలు వెచ్చించి మరీ 30 మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. 2020లో నాటిన ఈ మొక్కలు ఇప్పుడు బంగారు పంట ఇస్తున్నాయి. 2024లో ఒక్కో చెట్టుకు 30 కాయలు రాగా, 2025లో ఏకంగా 80 కాయలు కాశాయి. కాయ బరువు దాదాపు 500 గ్రాములు ఉంటుంది.

ఇతర మామిడి రకాల కంటే ఇది నెల ముందుగానే పూత, కాతకు రావడం మరో విశేషం. ఇక్కడి నేల అనుకూలంగా ఉండటంతో.. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ కడియం నర్సరీ నుండి ఒక్కో మొక్కను 3,500 రూపాయల చొప్పున మరో 120 మొక్కలను కొనుగోలు చేశారు. అదనంగా మరో ఎకరం విస్తీర్ణంలో ఈ సాగు చేపట్టగా, ప్రస్తుతం వచ్చిన పండ్లను కేవలం కుటుంబ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన పంటను త్వరలోనే మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు.

జిల్లా ఉద్యాన అధికారులు ఈ అరుదైన మామిడి రకం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఈ తోట పూతకు వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ పండ్ల ధర కిలో 2.50 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు పలుకుతాయన్నారు. రాష్ట్రంలో బహుశా ఒక్క రైతు మాత్రమే ఈ రకం మామిడిని సాగు చేస్తున్నారని భావిస్తున్నారు.
ఈ రకమైన మామిడి రసం పీల్చే పురుగులు (తామర పురుగులు, నల్లి), ఆకుమచ్చ వంటి తెగుళ్లకు త్వరగా గురవుతుంది. అధిక ధర ఉండటానికి ప్రధాన కారణం వాటి ప్రత్యేకమైన రుచి, క్రీమీ ఆకృతి.. పరిమిత ఉత్పత్తి. ఇవి ముదురు ఎరుపు లేదా ఊదా రంగులో ఉండి చాలా తియ్యగా ఉంటాయి. అంతేకాదు.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు (సి, ఇ, ఎ, కె).. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మియాజాకీ మామిడి రకం మొట్టమొదటగా 1984లో జపాన్‌లోని మియాజాకి ప్రాంతంలో పండించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ప్రస్తుతం జపాన్‌లోనే వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. మన దేశంలో కూడా పంజాబ్‌కు చెందిన ఒక రైతు ఈ రకం మామిడిని సాగు చేసి, వాటి భద్రత కోసం బౌన్సర్లను నియమించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com