- 30 మంది ఐఏఎస్‌లు బదిలీలకు రంగం సిద్ధం?
- సీఎంఓ ప్రక్షాళనకు రేవంత్ నిర్ణయం?
- ఇటీవలే 18 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పీఠాన్ని అధిష్టించి ఏడాదిన్నర గడిచింది. పాలనలో సమర్థత, స్థిరత్వం లక్ష్యంగా తన కార్యాలయం అయిన సీఎంవో పేషీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. యేడాది పాటు ఎక్కడ ఉన్న వాళ్లను అక్కడే ఉంచి అధికారులతో పనులు చేయించుకున్నారు. ఇటీవలి కాలంగా ప్రభుత్వ యంత్రాంగంలో అవసరమైన మార్పులు చేస్తూ, తనదైన బృందాన్ని రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎంవోలో కీలక అధికారుల బదిలీలు, నియామకాలతో పాటు శాఖల పునర్విభజన చేపట్టారు.
పరిపాలన విభాగంలో ఐఏఎస్ లు అత్యంత కీలకపాత్ర పోషిస్తారు. విధానాల రూపకల్పన, వాటిని అమలుచేయడంలో ఐఏఎస్‌లు ఎంతో ముఖ్యం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర గడిచింది. 18 నెలల పాలనలో అధికారులపై ఇప్పటికీ పట్టు సాధించలేదు. అధికారుల నుంచి కూడా పెద్దగా సహకారం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈతరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి సీఎంవోలో సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో ఏప్రిల్ 27వ తేదీన 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంవో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన సంగీత సత్యనారాయణను వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా నియమించారు. ఆమె గతంలో వైద్యం, స్త్రీ-శిశు సంక్షేమం, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలను పర్యవేక్షించారు. అలాగే, పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ను సీఎంవోలోకి తీసుకొచ్చి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధి వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ చర్య రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించినది.సీఎం కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన మూడు నెలల్లో రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన అటవీ, వ్యవసాయం, పశుసంవర్ధక, రవాణా, పంచాయతీరాజ్ శాఖలను చూస్తున్నారు. షానవాజ్ ఖాసిమ్‌ను ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఈవోగా సుదీర్ఘకాలం పనిచేసిన కేఎస్ శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించారు. రిటైరైన ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు తమ పదవుల్లో కొనసాగుతారు. ఈ అధికారులు సీఎం సన్నిహిత బృందంగా కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే త్వరలో మరో 30మంది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని సగం జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం తప్పదని అధికారవర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ స్థాయి నుంచి జూనియర్ ఐఏఎస్ వరకు బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడపాదడపా ఐఏఎస్‌ల బదిలీలు చేసినప్పటికీ మొన్నటికి మొన్న 18 మంది ఐఏఎస్‌లను ఒకేసారి బదిలీ చేశారు. ఇప్పుడు మరో 30 మంది ఐఏఎస్‌లను కూడా బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందంటున్నారు.
వాస్తవానికి గత ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది అధికారులు ఆ స్థానంలోనే కొనసాగతున్నారు. ఈ నేపథ్యంలో ఆయాశాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులను మార్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందట. అయితే, అధికారుల బదిలీ అంటేనే చాలా అనుమానాలు రేకెత్తుతాయి. ఆయా శాఖల్లో పనితీరులో అసమర్థత, అవినీతి, అక్రమాల ఆరోపణలు వంటి అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఈ నేపథ్యంలో కొందరు అధికారులకు ప్రమోషన్ లభిస్తే, మరికొందరికీ ప్రాధాన్యం లేని శాఖల కేటాయింపు వంటి డిమోషన్ ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ పరిపాలనలో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సహకరించడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉన్న తాధికారుల పనితీరుపై పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. దీంతోపాటు ప్రభుత్వంలో కొనసాగుతూ రహస్యాలు బయటకు పంపుతున్నారని పలువు రు ఐఏఎస్‌లపై అనుమానాలు ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ కొందరు మాత్రం గత పాలకులకు సహకరిస్తున్నా రన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐఏఎస్‌లను బదిలీ చేసి పరిపాలన వ్యవస్థను గాడిన పెట్టాలని సీఎం రేవంత్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏసీ రూములు వదిలి గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాలను వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు వేదికలపై నుంచి అధికారులకు సూచించారు. అందులో భాగంగా విడతల వారీగా ఐఏఎస్‌లతోపాటు ఐపీఎస్, ఐఏఫ్‌ఎస్‌లను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.