ఎవ్వరిని వదలం.. ఒక్కొకరిని పట్టుకుంటాం.. వేటాడి మరీ పట్టుకుంటాం.. అందరిని అంతం చేస్తాం.. ఇదీ కేంద్రహోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. కశ్మీర్ ఉగ్రదాడిపై స్పందించిన ఆయన.. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పహెల్‌గామ్ ఉగ్రదాడుల్లో 26 మంది ప్రాణాలు తీశామని సంబరపడిపోవద్దని.. గెలిచామని అనుకోవద్దని.. ఆ చావులకు మీరు బాధ్యులు కావాల్సిందే అన్నారు అమిత్ షా.
కశ్మీర్ ఉగ్రదాడుల తర్వాత తొలిసారి బహిరంగంగా స్పందించారు అమిత్ షా. ఢిల్లీలో జరిగిన అసోంకి చెందిన బోడో నేత ఉపేంద్ర నాథ్ బ్రహ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు గతంలో ఉగ్రదాడులకు సమాధానాలు చెప్పామని.. ఈసారి కూడా అదే విధంగా సమాధానం చెప్తామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది నరేంద్రమోదీ ప్రభుత్వమని గుర్తుంచుకోవాలన్నారు అమిత్ షా.
కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా అంతం చేస్తామని బల్లగుద్దీ మరీ చెప్పారు అమిత్ షా. దేశంలోని ప్రతి అంగుళం మీద ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ సంకల్పమన్నారు. అంతేకాదు ఉగ్రవాదానికి సహాయం చేస్తున్నవారిని కూడా వదలమని ఇన్‌డైరెక్ట్‌గా పాక్‌కు వార్నింగ్ ఇచ్చారు. గతంలో గట్టిగా జవాబిచ్చాం.. ఇప్పుడు ఇస్తామంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. త్వరలోనే భారత్ ఏదో గట్టిగానే చేయబోతుందని తెలుస్తోంది.
ఇదే సమయంలో రాజస్థాన్‌లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్‌ను చేశారు ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వింగ్ అధికారులు. జైసల్మేర్‌లో పఠాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఖాన్‌పై అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద కేసు నమోదు చేశారు. భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో ఈ అరెస్ట్ కాస్త కలకలం రేపిందనే చెప్పాలి. అయితే ఖాన్‌ను నెల క్రితమే అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి అతడిని ప్రశ్నిస్తున్నారు. కానీ ఖాన్‌ను అధికారికంగా మే 1 అరెస్టు చేసినట్టు ప్రకటించారు.
2013 నుంచి పాక్ ఐఎస్ఐ కోసం ఖాన్ పనిచేస్తున్నట్టు గుర్తించారు. రాజస్థాన్‌లోని భారత్ పాక్ మధ్య ఉన్న సరిహద్దుకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 2013లో పాకిస్తాన్‌కు వెళ్లిన పఠాన్ ఖాన్ .. అప్పుడే పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో పరిచయం పెంచుకున్నారు. పాక్‌లోనే గూఢచర్యం శిక్షణ పొందిన ఖాన్.. అప్పటి నుంచి తరుచుగా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను కలవడం.. వారితో టచ్‌లో ఉండటం చేస్తున్నాడు. ఈ విషయాలన్ని గమనించి అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.