తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ములుగు జిల్లా తూర్పున చర్ల, దక్షిణాన వాజేడు-వెంకటాపురం మండలాలు, ఉత్తరాన పూజారి కాంకేర్, పశ్చిమాన ఇంద్రావతి నది పరిసరాల్లో భద్రతా దళాలు సుమారు 10 వేల మందితో విస్తృతంగా కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత హిడ్మా గుట్టల్లో తలదాచుకున్నాడన్న సమాచారం నేపథ్యంలో కర్రె గుట్టలను అన్నివైపులా ముట్టడి చేశారు.
ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే పలు ఎన్కౌంటర్లు జరిగాయి. తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. మావోయిస్టులు అమర్చిన బాంబులను గుర్తించేందుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ డీఆర్జీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.
కానీ, ఈ వేటలో ఓవైపు మావోయిస్టుల ముప్పు ఉండగా, మరోవైపు ప్రకృతి కూడా సవాలుగా మారింది. ములుగు జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకూ నమోదు అవుతుండగా, పీఠభూమిలో ఉన్న బండరాళ్ల వల్ల వాస్తవ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో వడదెబ్బల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 40 మందికి పైగా జవాన్లు సన్ స్ట్రోక్‌కు గురయ్యారు. కొందరిని హెలికాప్టర్ల ద్వారా భద్రాచలం, వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించగా, మరికొంతమందిని రోడ్డు మార్గాన వరంగల్ వైపు తరలించారు.
కర్రె గుట్టల్లో కూంబింగ్ చేయడం భద్రతా బలగాలకే ఓ తీవ్రమైన సవాల్‌గా మారిందని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. గత ఏడాది జూలైలోనూ ఇక్కడ వాతావరణ మార్పులతో బలగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం గుర్తుచేశారు. నాలుగు రోజుల పాటు 60 కి.మీ దూరం నడిచిన జవాన్లు, ఎండా వానా తట్టుకోలేక శారీరకంగా క్షీణించారు. చివరికి స్థానికుల సహాయంతో వారిని గుర్తించి, హెలికాప్టర్లతో హాస్పిటళ్లకు తరలించాల్సి వచ్చింది.
ఇప్పుడు కూడా అదే తరహా సాహసోపేతమైన పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. మావోయిస్టుల నుంచి రాష్ట్రాన్ని శుద్ధి చేయాలన్న సంకల్పంతో భద్రతా బలగాలు ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు సాగుతున్నాయి. మరోవైపు సహజ వాతావరణం కూడా వారిపై శరీరికంగా దాడి చేస్తున్న నేపథ్యంలో, ఈ ఆపరేషన్ ఎటు తిరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది.