- వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేసింది
- గ్రీన్ రెవల్యూషన్, ఉపాధి హామీ, రైతు రుణమాఫీ…
- వ్యవసాయ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వాల చలువే
- దేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం తగ్గుతోంది
- కేరళ రాష్ట్ర రైతులు కార్మికుల మహాసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రైతులు మన ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఆయన కేరళ రాష్ట్రం కోజీకోడ్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతులు, కార్మికుల మహాసభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో వ్యవసాయం ఒక జీవన విధానం అన్నారు. అలాంటి వ్యవసాయ రంగం నేడు అకాల వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, మార్కెట్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, మారిన వాతావరణ ప్రభావం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం క్రమంగా తగ్గుతోందన్నారు. 2016లో 17.5% కాగా ప్రస్తుతం అది 14% గా నమోదు అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మన దేశంలో సగం జనాభా వ్యవసాయ రంగంతోనే ముడి వేసుకుని ఉన్నారని తెలిపారు.
స్వాతంత్రానంతరం కాంగ్రెస్ వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడి పని చేసింది అని డిప్యూటీ సీయం భట్టి గుర్తు చేశారు. స్వర్గీయ ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి నేతల సారథ్యంలో హరిత విప్లవాన్ని సహకారం చేశారని, అధిక ఉత్పత్తి ఇచ్చే విత్తనాలు, మెరుగైన నీటిపారుదల వ్యవస్థ, ఎరువులు అందుబాటులోకి తీసుకువచ్చారని భట్టి వివరించారు. ఈ చర్యల మూలంగా ధాన్యం ఉత్పత్తి 55 మిలియన్ టన్నుల నుంచి 1978,- 79 నాటికే 131 మిలియన్ టన్నులకు పెరిగిందని, ఈ పరిణామం కేవలం వ్యవసాయం వృద్ధికే కాదు గ్రామీణ భారతంలో ఉపాధిని, ఆర్థిక శక్తిని బలోపేతం చేసింది అని అన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే బీజం వేసాయన్నారు. 1965 లో లాల్ బహుదూర్ శాస్త్రి మద్దతు వ్యవసాయ ధరల కమిషన్(APC)ను స్థాపించారని తెలిపారు. ఇందిరా, రాజీవ్ గాంధీ ల కాలంలో వ్యవసాయ ధరల కమిషన్ ను మరింత బలోపేతం చేశారని భట్టి పేర్కొన్నారు.
రైతులను స్వతంత్రులను చేసేందుకు రుణమాఫీ అవసరం అన్నారు. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం 71,000 కోట్ల రుణాలను మాఫీ చేసిందని, దీని ద్వారా దేశంలో 3.68 కోట్ల మంది రైతులకు ఉపశమనం కలిగిందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆశీర్వాదంతోనే ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 12,000 పెట్టుబడి మద్దతుగా అందిస్తున్నామని భట్టి వివరించారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా, సన్నధాన్యం సాగుచేసిన రైతులకు క్వింటాలుకు 500 బోనస్, 10,547 కోట్ల విలువైన పంటల సేకరణ వంటి చర్యలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేపట్టినట్టు సరికొత్త పథకాలని డిప్యూటీ సీయం తెలిపారు.
సమాజాన్ని నడిపించేది అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులే అన్నారు. తక్కువ వేతనాలు, రక్షణ లేని పరిస్థితులు వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి ఉపాధి, ఆదాయాన్ని స్థిరంగా అందిస్తున్నామని, అసంఘటిత రంగ కార్మికులకు డిజిటల్ నమోదు ద్వారా బీమా, పెన్షన్ వంటి సహకారం అందిస్తున్నట్టు వివరించారు. జిగ్ వర్కర్ల హక్కులను గుర్తించి, వారికి ఆరోగ్య భీమా, సామాజిక భద్రత కల్పించే విధానాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తుంది అన్నారు. కేరళ భూమి సాధారణమైనది కాదు త్యాగాలు, పోరాటలతో పునీతం అయింది అన్నారు. పున్నప్ర, వయలార్ వంటి ప్రజా ఉద్యమాలు వ్యవసాయ కూలీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు మరువలేనివి అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు రైతు, కార్మికుల వెంట నడిచింది, గాంధీజీ స్వరాజ్య పిలుపు నుంచి కేరళ భూ సంస్కరణల వరకు ఇది స్పష్టం అయ్యింది అన్నారు. గౌరవం అనేది ఒకరు ఇచ్చేది కాదు అది అందరికీ లభించాల్సిన హక్కు అని డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ఆంటోని జోసఫ్, ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, డిసిసి అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.