39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఈడీ సోదాలతో ఉలిక్కి పడిన పాతబస్తీ

తెలంగాణలో భూదాన్ భూముల అక్రమ లావాదేవీలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ ఇద్దరు దాదాపు వంద ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన కీలకమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ పరిణామాలతో హైదరాబాద్ పాతబస్తీ మొత్తం కలకలం చెలరేగింది. యాకుత్‌పురా, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హఠాత్తుగా ఇళ్లపై మెరుపు దాడులు జరపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడులు భూదాన్ భూముల అక్రమ విక్రయాల వ్యవహారానికి సంబంధించినవని తెలిసి స్థానికులు కాస్తంత కుదుట పడ్డారు.

ఈ కేసులో ఈఐపీఎల్ అనే ప్రైవేట్ కంపెనీ ముఖ్య పాత్ర పోషించినట్లు ఈడీ అనుమానిస్తోంది. సుకూర్ అనే వ్యక్తి ఈ కంపెనీకి బినామీగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుకూర్‌తో పాటు అతని బంధువు షర్ఫన్, మరికొంతమంది ఇళ్లలో కూడా ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. దాడుల్లో లభించిన పత్రాలతో అక్రమ లావాదేవీల పరంపరకు సంబంధించి మరిన్ని బాగోతాలు బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.

గతంలో ఇదే కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ను, మహేశ్వరం తహసీల్దార్‌ను కూడా ఈడీ విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. పేదల కోసం ఉద్దేశించిన భూదాన్ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా సొంతం చేసుకుని లే అవుట్లు వేసి విక్రయించారని ఈడీ అనుమానిస్తోంది.

మహేశ్వరం ప్రాంతంలోని సుమారు వంద ఎకరాల భూదాన్ భూములను మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా ఆధ్వర్యంలో అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లావాదేవీలలో కొంతమంది ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారుల ప్రమేయం కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, వీరికి సహకరించిన అధికారులెవరు? వాళ్ల పాత్ర ఎంత? అన్న కోణంలోనూ ఈడీ నిశితంగా దర్యాప్తు సాగిస్తోంది. అవసరమైన ఆధారాలు సేకరిస్తోంది.

ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ భూముల అసలు యజమానులు ఎవరు? అవి వాళ్ల తర్వాత ఎవరికెవరికి బదిలీ అయ్యాయన్న విషయాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఈఐపీఎల్ కంపెనీ, సుకూర్ మధ్య సంబంధం, వారి భూముల అమ్మకాల్లో పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాకుండా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈ భూములు ఎలా అమ్మారన్న విషయాలపైనా ఈడీ కూపీ లాగుతోంది. అయితే, ఈ సోదాలు, విచారణలతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈడీ సిద్ధమవుతోందని సమాచారం.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com