36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

ఇందిరమ్మ ఇళ్లపై క్షేత్రస్థాయిలో జోరుగా పరిశీలన

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో దశలో ఇళ్ల నిర్మాణాల కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొన సాగుతోంది. ఓవైపు పైలెట్‌ గ్రామాల్లో పునాది స్థాయి దాటిన ఇళ్లకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ లబ్దిదారుల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పైలట్‌ గ్రామాల్లో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగతా గ్రామాల్లో అర్హులను గుర్తించేందుకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో మండలాన్ని జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు.

ప్రతి గ్రామంలో గెజిటెడ్‌ స్థాయి అధికారి సుమారు 200 దరఖాస్తులను సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి అర్హతలు ఏంటి? జాబితాలో అనర్హులు ఎంతమంది ఉన్నారో సర్వే ద్వారా తేల్చనున్నారు. దరఖాస్తుదారు వృత్తి, ప్రస్తుత ఇంటి స్థితిగతులు, ఇంటి నిర్మాణానికి సొంత స్థలం ఉందా? ఒకవేళ స్థలం ఉన్నా దానికి సంబంధించిన పట్టా, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నాయా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆదాయం నెలకు రూ.15,000, మున్సిపాలిటీలు, నగరాల్లో అయితే, రూ.25,000లోపు ఉందా? అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా? అనే వివరాలను జాబితాలో పొందుపరుస్తున్నారు. గ్రామాల్లో దరఖాస్తుదారు కుటుంబం స్థానికంగానే నివాసముంటుందా? మున్సిపాలిటీల్లో అయితే, అక్కడ ఐదేళ్లుగా నివాసముంటున్నారా? లేదా? అనే సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేనివారిని.. ఈ సర్వే ద్వారా అనర్హుల జాబితాలో చేర్చనున్నారు. క్షేత్రస్థాయిలో గెజిటెడ్‌ అధికారి సర్వే చేసి అర్హులుగా గుర్తించి ధ్రువీకరించిన వారికే రెండో దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా పక్కా పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించింది.

తొలి దశలో భాగంగా ప్రతి మండలానికో గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద అధికారులు ఎంపిక చేసి అర్హులైన వారి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం అధికారుల సర్వే పూర్తయ్యాక జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధ్రువీకరించిన దరఖాస్తుదారులకే.. ఇళ్లు దక్కనున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు అర్హతల పరిశీలన ప్రక్రియ పూర్ చేయనున్నారు. మే 2వ తేదీ వరకు లబ్ధిదారుల జాబితాను గ్రామ, మున్సిపాలిటీ, నగరపాలక కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అర్హులను గుర్తించే ప్రక్రియ సాగుతోంది. ఒక్కో గెజిటెడ్‌ అధికారి 150 నుంచి 200 దరఖాస్తులను సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జిల్లాలోని అర్హుల జాబితాను తొలుత కలెక్టర్‌కు అందజేస్తారు. అక్కడి నుంచి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి చేరుతుంది. లబ్ధిదారుల తుది జాబితాలను ప్రదర్శించి ఇళ్లు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది పూర్తిగా సబ్సిడీ రూపంలో ఉంటుంది. ఇల్లు లేని వారికి ఉచితంగా స్థలం లేదా స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన దశలను బట్టి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు బదిలీ చేస్తారు. సాధారణంగా నిధులు మూడు లేదా నాలుగు విడతలుగా విడుదల చేస్తారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు వాళ్ల ఇంటి నిర్మాణం స్థాయి ఆధారంగా ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తారని తెలుస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com