భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ క్యాడర్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రంలో అధికారం చెలాయించిన కేసీఆర్.. మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పోతున్నారు.అందుకే యేడాదిన్నర గడుస్తున్నా.. ఇప్పటి వరకు బయటకు రాలేదు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. అనర్హత నుంచి తప్పించుకునేందుకు ఒకే ఒక్క రో్జు అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. ఇక,ఇప్పుడు ఈ సమయంలో జరుగుతున్న పార్టీ రజతోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు కేసీఆర్. ఈ సభ నిర్వహణతో తెలంగాణ సమాజమంతా బీఆర్ఎస్, కేసీఆర్ వెంటే ఉందన్న సంకేతాలు వచ్చేలా సభ నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే భారీగా జన సమీకరణ చేపట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు రూపొందించారు.
ఈ సభ ఏర్పాట్ల బాధ్యతలు హరీష్‌రావుకు అప్పగించినప్పటికీ.. కేటీఆర్, కవితకు కూడా ప్రత్యేకంగా టార్గెట్ నిర్దేశించారట కేసీఆర్. సభను ఎలాగైనా సక్సెస్ చేయడమే కాదు.. దీనిపై విస్తృతంగా చర్చ జరిగే రీతిలో జన సమీకరణ ఉండాలని కేసీఆర్ తేల్చి చెప్పారంటున్నారు.
ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టడంలో గులాబీదళం లీనమై పోయింది. రజతోత్సవ సకు వచ్చే కార్యకర్తలు, ప్రజల కోసం ఇప్పటికే మూడు వేలకు పైగా ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకున్నారు. దీనికోసం బీఆర్ఎస్ తరపున తెలంగాణ ఆర్టీసీకి రూ.8కోట్లు చెల్లించారు. ఇవి మాత్రమే కాకుండా.. మరో మూడు వేలకు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కూడా బుక్ చేశారు. వీటికి అదనంగా మరో నాలుగు వేల స్కూల్ బస్సులు, వివిధ సంస్థలకు చెందిన బస్సులను కూడా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనం తరలింపునకు వినియోగించుకుంటున్నారు.
ఇలా.. జనం రవాణాకు ఎక్కడా లోటు లేకుండా బుకింగ్స్ మాత్రం పూర్తి చేసి పెట్టారు. ఇక, నాయకుల వంతు మిగిలి ఉంది. అవసరమైన జనాన్ని సమీకరించి బహిరంగ సభకు తరలించడమే మిగిలింది. కానీ, ఎండాకాలం మొదలయ్యింది. ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి. జనాన్ని భయపెడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు కూడా జనం జంకుతున్నారు. ఇక, ఉత్తర తెలంగాణలో భానుడు సెగలు కక్కుతున్నాడు. మరి.. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నిర్దేశించుకున్నట్లుగా బహిరంగసభకు అనుకున్నంత జనం తరలి వస్తారా? అన్న సందిగ్ధం నెలకొంది. ఈ రజోత్సవ సభకు పది లక్షల మందిని తరలించాలని కేసీఆర్ టార్గెట్ నిర్దేశించారని అంటున్నారు. ఈ సభకు హాజర్యే జనం సంఖ్య ఓ మైలు రాయి కావాలని ఆశపడుతున్నారట. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో, మండుతున్న ఎండల్లో ఈ స్థాయిలో జనం వస్తారా? అని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.
అయితే, ఈ సభకు నిర్దేశించుకున్న స్థాయిలో జనాన్ని సమీకరించుకోలేక పోతే.. అభాసు పాలవుతామంటూ కేటీఆర్, కవితలకు కేసీఆర్ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ స్వయంగా రంగంలోకి దిగి జన సమీకరణపై పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం. అయినా.. పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అన్న బెంగ కేసీఆర్‌తో పాటు.. కేటీఆర్, కవితల్లో పట్టుకుందంటున్నారు.