34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

కవ్వింపు చర్యలతో దాయాది దేశం బెదిరింపు !!

  • కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు..

  • పాక్ పౌరుల వీసాలు రద్దు చేసిన భారత్..

  • కౌంటర్ గా భారతీయుల వీసాలు రద్దు చేసిన పాక్

  • అన్ని ఒప్పందాలనుంచి వెనక్కు మళ్లిన భారత్

  • తమదీ అదే రియాక్షన్ అని కౌంటర్ విసిరిన పాక్

  • వాఘా బోర్డర్ మూసివేత..భారతీయులను వెనక్కు పొమ్మని ఆదేశం

  • ఇండస్ జలాలు మళ్లించినా, నిలిపివేసినా ఊరుకోం

  • సిమ్లా ఒప్పందాన్నీ రద్దు చేసుకున్నట్లే అంటూ బెదిరింపు

  • ఉగ్రవాదాన్ని భారత్ ఎగదోస్తోందంటూ ఉల్టా బుకాయింపు

  • ఇండస్ జలాలు నిలిపివేస్తే పాక్ దుస్థితి మరింత దిగజారుడు

  • పాక్ గగనతలం నుంచి భారత్ విమానాలకు చెక్

  • వాణిజ్య మార్గాన్నీ బంద్ చేసిన దాయాది దేశం

పెహల్గాంలో అమాయక టూరిస్టులను పొట్టన బెట్టుకున్నపాక్ ప్రేరిత ఉగ్రవాద చర్యకు నిరసనగా భారత్ ఘాటుగా స్పందించింది. ఆదేశంతో దౌత్య సంబంధాలన్నింటినీ తెగ తెంపులు చేసుకుంది. సిమ్లా ఒప్పందం రద్దు చేస్తామంటూ దుందుడుకు బెదిరింపు చేసి యుద్ధానికి కవ్వించింది. ఇప్పటికే రెండు దేశాల సరిహద్దుల దగ్గర సైనిక దళాలు మోహరించి ఉన్నాయని అనధికారిక వార్తలు సూచిస్తున్నాయి.

పాక్ జాతీయుల వీసాల రద్దు :

పాకిస్థానీ జాతీయులకు మన దేశం ఇచ్చిన వీసాలన్నింటినీ ఈనెల 27 నుంచి రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే మెడికల్ వీసాలకు మాత్రం రెండు రోజులు గడువిచ్చింది. ఇవి ఈ నెల 29 తర్వాత పనిచేయవని ప్రకటించింది. భారతీయులెవరూ పాకిస్థాన్ కి వెళ్లవద్దని,ప్రస్తుతం ఆదేశంలో ఉన్న భారతీయులు సాధ్యమైనంత త్వరగా వెనక్కు రావాలని పిలుపునిచ్చింది.పాకిస్థాన్ దేశస్తులకు వీసా సర్వీసులను తక్షణం రద్దు చేస్తున్నట్లు మనదేశం ప్రకటించింది.

మా రియాక్షన్ కూడా సేమ్ టు సేమ్ : పాకిస్థాన్

అయితే భారత్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ కూడా అంతే దూకుడుగా స్పందించింది. భారత్ ఏవైతే రద్దు చేసిందో వాటన్నింటినీ తాము కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ రక్షణ శాఖ సుదీర్ఘ మంతనాల అనంతరం భారత చర్యలన్నింటికీ తమ వైపు నుంచి కూడా అదే ప్రతిస్పందన కొనసాగుతుందని తేల్చి చెప్పింది. సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీము కింద భారతీయులను ఆదేశంలోకి అనుమతించబోమని తెలిపింది. దీంతో పాటు ఇతర వీసా సర్వీసులను కూడా సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది.పాకిస్థాన్ లో ఉన్న ఇండియన్ హై కమిషన్ కార్యాలయంలో దౌత్య సిబ్బందిని 30 కి కుదిస్తున్నట్లు ప్రకటించింది.

ఇండస్ ఒప్పందం రద్దు చేస్తే యుద్ధమే!

పాకిస్థాన్ తో ఇండస్ జలవనరుల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. నదీజలాలపై తమ హక్కులను ఒప్పందానికి విరుద్ధంగా రద్దు చేస్తే ఇది యుద్దాన్ని రెచ్చగొట్టే చర్యగానే భావిస్తామని తెలిపింది. పాకిస్థాన్ కు చెందాల్సిన జలాలను మళ్లించడం, లేదా దిగువ దేశంగా తమకు ఉన్న హక్కులను కాలరాసినా అది యుద్ధం కిందే భావిస్తామంది. అదే జరిగితే తమ బలగాలతో తిప్పి కొట్టేందుకు తాము సదా సిద్ధమని రెచ్చగొట్టింది.

పాక్ కి మరింత అధ్వాన్నం

ఇండస్ నదీ జలాలు, మరో రెండు నదులైన జీలం, చెనాబ్ నదుల నీటిని భారత్ తనకున్న హక్కులతో నిలిపివేసినా లేదా నీటిని మళ్లించినా పాకిస్థాన్లో కోట్లాది మంది నష్టపోతారు. పాకిస్థాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. భారత్ ఈ శిక్ష పాకిస్థాన్ కు వేస్తే ఆదేశం స్థితి అంతకన్నా అధ్వాన్నంగా దిగజారిపోతుంది.

సిమ్లా ఒప్పందానికి ప్రమాదం ..

మనదేశంలోకి ఉగ్రవాదులను పంపి నరమేధానికి తెరతీసిన దాయాది దేశం ఉల్టా ఆదేశంలోకి మనమే ఉగ్రవాదులను ఎగదోస్తున్నామని ఆరోపించింది. భారత్ ద్వైపాక్షిక ఒప్పందాలన్నీ రద్దు చేసుకుని, పాకిస్థాన్ హక్కులను కాలరాస్తే తాము కూడా అదే విధంగా స్పందిస్తామని, సిమ్లా ఒప్పందాన్నికూడా సుప్త చేతనావస్తలో పెడతామని హెచ్చరించింది.

ఏమిటీ సిమ్లా ఒప్పందం..

పాకిస్థాన్ ఇలా భారత్ ను బెదిరించడానికో కారణముంది.1971లో చేసుకున్న సిమ్లా ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ రేఖను నిర్ణయించారు. వాస్తవాధీన రేఖ అని కూడా దీనిని అంటారు. ఇక్కడ రెండు దేశాలు తమ తమ సైన్యాన్ని మోహరించి ఉంచుతాయి.పాకిస్థాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తే వాస్తవాధీన రేఖ మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది.అంటే ఇది ఒక రకంగా భారత్ ను యుద్ధానికి పురికొల్పడమే.భారత్ తీసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాల రద్దు నిర్ణయంపై ఘాటుగా స్పందించిన పాక్ అందుకు తాముకూడా సై అని ప్రకటిస్తూ మరికొన్ని అంశాల పై కూడా క్లారిటీ ఇచ్చింది.

వాఘా బోర్డర్ పోస్టును తక్షణం మూసేస్తున్నామంది. ఈ మార్గంలో భారత్ కొనసాగించే సీమాంతర రవాణాను రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఇప్పటికే ఈ మార్గంలో సరైన పత్రాలతో దేశం దాటి వచ్చిన వారంతా వెనక్కు మళ్లాలని ఈనెల 30లోగా అందరూ వెళ్లి పోవాలని స్పష్టం చేసింది.
 సిక్కు మత యాత్రీకుల వీసాలను తప్పించి అన్ని సార్క్ వీసా మినహాయింపు స్కీములను రద్దు చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఈ స్కీము కింద ఉన్న వారంతా(సిక్కులను మినహాయించి) 48 గంటల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించింది.
పాకిస్థాన్ గగన తలాన్ని తక్షణం మూసేసింది. భారత విమానాలు లేదా మనదేశంలో ఆపరేట్‌ అయ్యే ఇతర ఎయిర్ లైన్స్ కు అనుమతి లేదని తెలిపింది.
భారత్ పాకిస్థాన్ భౌగోళిక మార్గం ద్వారా మరే ఇతర దేశంతోనూ వాణిజ్యం నెరపే అవకాశాన్ని రద్దు చేసింది.
తమ దేశ సార్వభౌమాధికారాన్ని,ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు తమ సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, తమ దేశం సార్వభౌమత్వం, రక్షణ, గౌరవం, ఇతర హక్కులకు ఎవరు భంగం కలిగించినా ఊరుకోబోమని స్పష్టం చేసింది.
ఇంకా స్పందించని భారత్

పాక్ చేసిన ఈ దుందుడుకు ప్రకటనలు, రెచ్చగొట్టే ప్రకటనలపైనా, సిమ్లా
ఒప్పందం రద్దు పైనా భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com