- పెహల్గాం దాడిపై మౌనం వీడిన ప్రధాని
- బీహార్ మధుబనిలో తొలిసారి బహిరంగ ప్రకటన
- టూరిస్టు మృతులకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని
- బాధిత కుటుంబాలకు అండగా నిలబడతాం
- యావద్దేశం మీ వెంట, మీతోనే ఉందన్నప్రధాని
- ఉగ్రదాడి కారకులను, పాత్రధారులను ఇద్దరినీ వదలం..
- దొంగ దాడులతో భారత స్ఫూర్తిని దెబ్బ తీయలేరన్న ప్రధాని
- పాకిస్థాన్ తో దౌత్య సంబంధాలపై వేటు
- ఇండస్ నదీ జలాల ఒప్పందం రద్దు, అట్టారీ చెక్ పోస్ట్ మూసివేత
- పాక్ పౌరులకు నో ఎంట్రీ
- పాక్ హై కమిషన్ అడ్వైజర్లను పెర్సొనా నాన్ గ్రాటాగా గుర్తింపు
- పాక్ హై కమిషన్ సిబ్బందిని కుదించేయాలని నిర్ణయం
పెహల్గాం దాడి కారకులైన ఉగ్రవాదులను, వారికి దన్నుగా నిలిచిన సూత్రధారులను ఎక్కడున్నా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. భారత్ ఐక్యతను, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరని పెహల్గాం ఉగ్రవాదులకు తీవ్రమైన హెచ్చరిక చేశారు.పెహల్గాం దాడిపై ప్రధాని తొలిసారి మౌనం వీడి స్పందించారు. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీహార్ లోని మధుబని వెళ్లిన ప్రధాని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతికి మౌనం పాటించి, నివాళులర్పించారు. అమాయక టూరిస్టులను అత్యంత పాశవికంగా హతమార్చిన వైనంపై యావద్దేశం బాధతో స్పందిస్తోందన్నారు.
భారత ఆత్మపై జరిగిన దాడి
బాధిత కుటుంబాలకు మద్దతుగా యావద్దేశం నిలబడింది. గాయపడిన వారు త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతున్నాం. ఈ దాడిలో కొందరు తండ్రులను కోల్పోయారు. కొందరు బిడ్డలను కోల్పోయారు. మరికొందరు జీవిత భాగస్వాములను కోల్పోయారు. ఒకరు బెంగాలీ,ఒకరు కన్నడా, మరొకరు మరాఠీ, మరొకరు ఒరియా.. కొందరు గుజరాతీలున్నారు. కొందరు బీహారీల సంతానమూ ఈ దాడి బారిన పడిన వారిలో ఉన్నారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకూ దేశమంతా రోదిస్తోంది. ఇది అమాయక టూరిస్టులపై దాడి మాత్రమే కాదు. యావద్దేశం ఆత్మపై జరిగిన దాడి అని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈదాడికి ప్లాన్ చేసిన సూత్రధారులు, ఈదాడికి పాల్పడిన ఉగ్రవాదులు అందరికీ ఎవరూ ఊహించనంత కఠిన శిక్ష పడుతుంది. ఉగ్ర స్వర్గ ధామంలో మిగిలిన వారందరిని తుడిచి పెట్టేస్తాం. ఉగ్రదాడి సూత్రధారుల వెన్ను విరిచేయాలని 140 కోట్ల హృదయాలు బాధతో రగిలిపోతున్నాయి. ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయిన పాకిస్థాన్ ను ఉద్దేశించి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కష్ట సమయంలో భారత్ కు తోడుగా నిలిచిన ప్రపంచ దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని ఉగ్రదాడి విషయం తెలియగానే టూర్ ను రద్దు చేసుకుని భారత్ వచ్చేశారు. దాడి కారకులను వదిలిపెట్టేది లేదని ఘాటు హెచ్చరికలు చేశారు.
పాక్ దౌత్య సంబంధాలపై ఆంక్షలు
నిన్న రాత్రి జరిగిన అత్యవసర కేబినెట్ సమావేశంలో పాకిస్థాన్ తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించారు. ఇండస్ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలని, అట్టారీ దగ్గరున్న చెక్ పోస్ట్ ను మూసివేయాలని నిర్ణయించారు.సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీము కింద అనుమతిస్తున్న వీసాలను రద్దు చేశారు.పాకిస్థాన్ హై కమిషన్ లోని రక్షణ సలహాదారులను పెర్సనా నాన్ గ్రాటా అంటే ఆమోదనీయం కాని వ్యక్తులుగా ప్రకటించారు. మే 1 నాటికి పాకిస్థాన్ హై కమిషన్ సిబ్బందిని ఇప్పుడున్న 55 నుంచి 30కి కుదించేయాలని నిర్ణయించారు.